
కావలసిన పదార్థాలు: అర కప్పు ఉలవలు, 1 కప్పు బియ్యం, 3 కప్పుల నీళ్లు, వంట నూనె, 1 టీస్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సోంపు గింజలు, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 3 సన్నగా తరిగిన టమాటాలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి , 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మకరివేపాకు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

తయారీ విధానం: అర కప్పు ఉలవలను శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే వండే అరగంట ముందు ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టాలి. గుర్తుంచుకోవాల్సిన పక్కా కొలత: 1 కప్పు బియ్యానికి అర కప్పు ఉలవలు.

స్టవ్‌పై కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సోంపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గించాలి.

ఉల్లిపాయలు మగ్గాక 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్ల ధనియాల పొడి వేసి నూనెలో మసాలాలు మాడకుండా కలపాలి. వెంటనే సన్నగా తరిగిన 3 టమాటా ముక్కలు వేసి గుజ్జులా మారే వరకు మగ్గించాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న ఉలవలను నీరు లేకుండా వేసి.. మసాలా అంతా ఉలవలకు పట్టేలా ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి.

ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొద్దిగా వేసి ఎసరును మరగనివ్వాలి. నీళ్లు మరగడం మొదలవగానే.. నానబెట్టిన బియ్యాన్ని నీరు వార్చి వేసి ఒకసారి బాగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌పై కేవలం 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పొడిపొడిలాడుతూ ఘుమఘుమలాడే అన్నం సిద్ధమవుతుంది. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'ఉలవల రైస్' సిద్ధం! దీనిని చల్లటి పెరుగు రైతా, కరకరలాడే అప్పడం లేదా ఏదైనా రోటి పచ్చడితో నంజుకుని తింటుంటే అమృతతుల్యంగా ఉండటమే కాకుండా ఒంటికి అద్భుతమైన శక్తినిస్తుంది!