
భారత మహిళల క్రికెట్లో యువ ఆల్‌రౌండర్ నిఖీ ప్రసాద్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బౌలింగ్‌కు వచ్చిన ఆమె.. అంతర్జాతీయ కెరీర్లో వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తొలి రెండు బంతుల్లోనే వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిఖీ నిలిచారు. సభ్య దేశాల ఆటగాళ్లలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 14 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. ఈ సమయంలో భారత కెప్టెన్ స్మృతి మంధాన 21 ఏళ్ల నిఖీ ప్రసాద్‌ను బౌలింగ్‌కు దింపింది.

తన కెప్టెన్ నమ్మకాన్ని నిఖీ ప్రసాద్ వెంటనే నిలబెట్టుకుంది. అంతర్జాతీయ కెరీర్లో బౌలర్‌గా వేసిన తొలి బంతికే చిపో ముగేరి-తిరిపానోను 34 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపించింది. ఆ తర్వాతి బంతికే న్యాషా గ్వాంజురాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది. దీంతో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన నిఖీ.. తన బౌలింగ్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి ఓవర్ కావడం ఈ ఘనతకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా నిఖీకి వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని అందుకోలేకపోయింది. మొత్తం రెండు ఓవర్లు వేసిన ఆమె 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొటకటింది.

మహిళల టీ20 అంతర్జాతీయ చరిత్రలో కెరీర్ తొలి రెండు బంతుల్లోనే వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిఖీ ప్రసాద్ నిలిచింది. 2019లో బంగ్లాదేశ్‌పై అమెరికాకు చెందిన అనిసా రావ్ ఇదే ఘనత సాధించింది. అయితే ఐసీసీ సభ్య దేశాలకు చెందిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిఖీ ప్రసాద్ చరిత్ర సృష్టించింది. ఇక నిఖీ బౌలింగ్ దెబ్బకు జింబాబ్వే ఇన్నింగ్స్ గాడి తప్పింది. 14 ఓవర్లకు 75/3తో ఉన్న జింబాబ్వే.. 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులకే పరిమితమైంది.

మొదటి టీ20లోనూ నిఖీ ప్రసాద్ బ్యాట్‌తో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో 35 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి భారత్‌కు నాలుగు వికెట్ల విజయాన్ని అందించడంలో సహకరించింది. ఆ మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యం కూడా ప్రపంచ రికార్డుగా నిలిచింది. తాజాగా రెండో టీ20లో బంతితోనూ సత్తా చాటిన నిఖీ ప్రసాద్.. భారత మహిళల క్రికెట్లో తన అరంగేట్రాన్ని ఘనంగా మార్చుకుంది.