
ఓటీటీ వేదికగా డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లు, సినిమాలు నిరంతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, హారర్ థ్రిల్లర్ జోనర్లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందులో భాగంగా తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన పవర్ ప్యాక్డ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది విలేజ్' ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, వినూత్నమైన కథాంశంతో సస్పెన్స్‌ను పండిస్తోంది. దర్శకుడు మిలింద్ రావు తెరకెక్కించిన ఈ సిరీస్, భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఒక గ్రాఫిక్ నావెల్ ఆధారంగా రూపుదిద్దుకోవడం విశేషం. కథ విషయానికి వస్తే.. డాక్టర్ గౌతమ్ (ఆర్య) తన భార్య, కూతురుతో కలిసి ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు వారి కారు అడవికి సమీపంలో ఒక వింత గ్రామం దగ్గర పాడవుతుంది.

సాయం కోసం దగ్గరలోని గ్రామానికి వెళ్లిన గౌతమ్ భార్యాపిల్లలు అకస్మాత్తుగా మాయమవుతారు. అసలు ఆ గ్రామం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అక్కడ సంచరించే వింత జీవులు, మ్యూటెంట్ల వెనుక ఉన్న సైన్స్ వెనుక కథ ఏంటి? అనే అంశాలను ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. నటుడు ఆర్య డాక్టర్ గౌతమ్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆయన పడే తాపత్రయం, వింత ముప్పును ఎదుర్కొనే సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

దివ్య పిళ్లై, ఆడుకాలమ్ నరేన్, జాన్ కొక్కెన్ వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హారర్ మరియు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుతో వచ్చిన ఈ సిరీస్‌లో విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కొద్దిగా బ్లడ్ అండ్ గోర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి 'ది విలేజ్' ఒక విభిన్నమైన వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 35 నుండి 45 నిమిషాల వ్యవధితో సాగుతుంది. అశ్విన్ శ్రీవత్సంగమ్ , షమిక్ దాస్‌గుప్తా రాసిన పాపులర్ గ్రాఫిక్ నావెల్ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. కేవలం దెయ్యాల హారర్ కథగానే కాకుండా, ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రయోగాలు, బయో-కెమికల్ వేస్ట్ వల్ల ఏర్పడిన మ్యూటెంట్లు , గ్రామాల్లో ఉండే మూఢనమ్మకాల మేళవింపుగా కథ నడుస్తుంది.