
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నటి సత్యకృష్ణ కూడా ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎన్నో సినిమాల్లో తల్లి, అక్క, వదిన వంటి విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా, కొత్తగా కనిపించే క్యారెక్టర్లు చేయాలనే ఆసక్తి ఉందని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సత్యకృష్ణ కెరీర్‌లో మెంటల్ కృష్ణ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించారు. అయితే మొదట తనను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే సంప్రదించారని, ఆ తర్వాత లీడ్ రోల్ చేయాలని అడిగినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తర్వాత తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు తగ్గాయని ఆమె గుర్తుచేసుకున్నారు.

ప్రధాన పాత్రల్లో నటించిన తనను ఇకపై అలాంటి పాత్రలకే పరిమితం చేయాలని కొంతమంది దర్శకనిర్మాతలు భావించారని, దీంతో తాను ఇంతకుముందులా క్యారెక్టర్ రోల్స్ చేయలేకపోయానని చెప్పారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కొన్ని మంచి పాత్రలు కూడా తనకు లభించాయని తెలిపారు.

ఒక సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది నటీనటుల చేతుల్లో ఉండదని సత్యకృష్ణ అభిప్రాయపడ్డారు. తమకు అప్పగించిన పాత్రకు న్యాయం చేయడమే ఆర్టిస్టుల బాధ్యత అని పేర్కొన్నారు. తనను ఒక సినిమాలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే నమ్మకం దర్శకనిర్మాతలకు కలగాలని, నటిగా తనకు అదే ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు. తన రూపం కారణంగా ఎక్కువగా అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన మహిళలు, సంప్రదాయబద్ధమైన భార్య, తల్లి వంటి పాత్రలే వస్తున్నాయని సత్యకృష్ణ తెలిపారు.

అయితే తనకు మాత్రం ఇలాంటి పాత్రలకు భిన్నంగా ఉండే క్యారెక్టర్లు చేయాలని ఉందని చెప్పారు. ఇటీవల కొన్ని విభిన్నమైన పాత్రల్లో నటించానని, అవి విడుదల కావాల్సి ఉందని గతంలో వెల్లడించారు. ఒక ఓటీటీ ప్రాజెక్టులో ఇప్పటివరకు తాను చేయని తరహాలో చాలా భిన్నమైన పాత్ర పోషించినట్లు కూడా తెలిపారు. నటిగా కొత్త ప్రయోగాలు చేయాలని ఉందని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆసక్తి ఉందని ఆమె తెలిపారు.