
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీ, యానాంలో వర్ష సూచన: ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఆది,సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

రాయలసీమలోనూ వర్షాలు: ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది

తెలంగాణలో ఈ జిల్లాలకు అలర్ట్: ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే ఈ జిల్లాల్లో వర్షాల సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచించింది.