Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో విపక్ష కూటమి వాటా పెరుగుతుందా..? పూర్తి వివరాలు..

| Edited By: Shaik Madar Saheb

Jul 11, 2024 | 1:06 PM

లోక్‌సభ ఎన్నికల్లో 236 మంది సంఖ్యాబలాన్ని సాధించిన విపక్ష కూటమి (I.N.D.I.A)కి త్వరలో కొత్తగా ఏర్పాటు కానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో వాటా పెరగనుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయా పార్టీల సంఖ్యాబలాన్ని అనుసరించి శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలకు ఛైర్‌పర్సన్లుగా నియమించే విషయంలోనూ ఇదే సూత్రం ప్రకారం నడుచుకుంటారు.

Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో విపక్ష కూటమి వాటా పెరుగుతుందా..? పూర్తి వివరాలు..
Pm Modi Rahul Gandhi
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో 236 మంది సంఖ్యాబలాన్ని సాధించిన విపక్ష కూటమి (I.N.D.I.A)కి త్వరలో కొత్తగా ఏర్పాటు కానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో వాటా పెరగనుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయా పార్టీల సంఖ్యాబలాన్ని అనుసరించి శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలకు ఛైర్‌పర్సన్లుగా నియమించే విషయంలోనూ ఇదే సూత్రం ప్రకారం నడుచుకుంటారు. 18 లోక్‌సభలో విపక్ష కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అందులో 99 మంది ఎంపీలతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కేబినెట్ హోదా కల్గిన ప్రతిపక్ష నేత పదవిని తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కీలకమైన కమిటీలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. జులై 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే ఈ కమిటీల కూర్పు జరగనుంది. కమిటీల్లో సభ్యులుగా ఆయా పార్టీల నుంచి పేర్లను ప్రతిపాదించాలని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరియేట్ల నుంచి లేఖలు వెళ్లాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. వాటిలో 16 కమిటీలు లోక్‌సభ పరిధిలో ఉండగా, 8 కమిటీలు రాజ్యసభ పరిధిలో ఉంటాయి. కమిటీల కూర్పు, ఛైర్‌పర్సన్ల నియామకాలను ఆయా సభల అధిపతులు చేపడతారు.

ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం?

లోక్‌సభ ఎన్నికల కంటే ముందు మూడు స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించింది. వాటిలో వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం, పర్యావరణం, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కామర్స్ కమిటీకి ఛైర్మన్‌గా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యవహరించగా, ఆయన ఈ మధ్యనే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 17వ లోక్‌సభలో 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కి ఒక్క ఛైర్మన్ పదవి కూడా దక్కలేదు. ఆరోగ్యశాఖకు చెందిన స్టాండింగ్ కమిటీకి మొదట్లో సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా, ఆ తర్వాత అది బీజేపీ పరమైంది. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన స్టాండింగ్ కమిటీకి డీఎంకే నేత కే. కనిమొళి నేతృత్వం వహించారు. మొత్తంగా విపక్ష కూటమి 5 కమిటీలకు నేతృత్వం వహించగా.. ఈ సారి పెరిగిన సంఖ్యాబలం ప్రకారం మరో మూడు కమిటీలు తమ చేతికి చిక్కుతాయని ఇండి-కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం పార్లమెంటులో అధికారపక్షానికి 55% మంది సభ్యులుండగా, విపక్షానికి 45% మంది ఉన్నారు. 24 కమిటీలను ఈ లెక్కన విభజిస్తే.. ఎన్డీఏకు 13, ఇండి-కూటమికి 11 దక్కాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతిపక్ష కూటమికి మరో 6 స్థానాలు దక్కాల్సి ఉంటుంది. అదనంగా పొందే ఆ కమిటీల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఉభయ సభల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 42 మంది ఉండగా, సమాజ్‌వాదీ పార్టీకి 41 మంది ఎంపీలున్నారు. సంఖ్యాబలానికి తగ్గ వాటా సాధించుకోవాలని విపక్ష కూటమి పార్టీలు భావిస్తున్నాయి. అయితే కమిటీల కూర్పు, ఛైర్మన్ల నియామకం విషయంలో తుది నిర్ణయం మాత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ చేతుల్లోనే ఉంటుంది.

శాఖాపరమైన 24 స్టాండింగ్ కమిటీలతో పాటు ఆర్థిక వ్యవహారాలు, అడ్-హక్ ప్యానెల్స్, శాసన వ్యవహారాలకు సంబంధించి మరికొన్ని స్టాండింగ్ కమిటీలు కూడా ఉంటాయి. అలాగే ఏవైనా బిల్లులపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరని సందర్భాల్లో.. ఆ బిల్లలను రివ్యూ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీలు సైతం ఏర్పాటవుతుంటాయి. అంతేకాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణాలపై విచారణకు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటవుతుంటాయి. గతంలో స్టాక్ మార్కెట్ కుంభకోణం, సాఫ్ట్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు వంటి అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, స్టాండింగ్ కమిటీలు సహా పార్లమెంటరీ వ్యవస్థలో వీలైనంత కీలక భాగస్వామ్యం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో విపక్షంలో తాము పోషించే పాత్ర తదుపరి ఎన్నికల్లో తమ విజయానికి పునాదిగా మారుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉభయ సభాపతులు ప్రతిపక్షాలకు పార్లమెంటరీ కమిటీల్లో ఎంత మేర భాగస్వామ్యం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..