Justice Pushpa Virendra Ganediwala: జస్టిస్ పుష్ప గనేడివాలా. ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆ జడ్డి ఇచ్చే ఇచ్చే తీర్పులు వైరైటీగా ఉండటమే ఇందుకు కారణం. జనవరి 15, 2021న పోక్సో చట్టం కింద అరెస్టైన నిందితులకు శిక్ష పడదని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గనేడివాలా. కేసు ఏదైనా మహిళలకు వ్యతిరేకంగా ఆ న్యాయమూర్తి తీర్పునిస్తున్నారనే చర్చ సాగుతోంది. సరైన ఆధారాలు లేవనే సాకుతో నిందితులను వదిలేస్తున్నారనే విమర్శ లేకపోలేదు. రేప్ కేసు నిందితులపై సరైన సాక్ష్యం లేదంటూ కొట్టేసిన కేసులు పుష్ప చరిత్రలో చాలానే ఉన్నాయి.
దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదు. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేం. చట్టం ఇదే విషయాన్ని చెబుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చింది జస్టిస్ పుష్ప గనేడివాలా. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి లేదా దుస్తుల లోపలికి చెయ్యి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ఆ కోర్టు తీర్పునిచ్చింది.
2016లో సతీశ్ అనే వ్యక్తి ఒక బాలికకు పండు ఇస్తానని ఆశచూపాడు. ఆ తర్వాత తన ఇంటికి తీసుకువెళ్లి బాలిక ఛాతిని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భయం వేసిన ఆ బాలిక కేకలు వేసింది. కూతురు అరుపులు విన్న తల్లి అక్కడకు రావడంతో అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. జనవరి 19న 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తు నిందితుడికి శిక్ష విధించింది కింది కోర్టు. ఈ కేసు పై బాంబే హైకోర్టును ఆశ్రయించాడు నిందితుడు. పోక్సో చట్టం కింద విధించే కఠిన శిక్షల స్వభావం పై పరిశీలించాలని కోరాడు. ఈ కేసు పై బాంబే కోర్టులో విచారణ జరిగింది. విచారించిన నాగ్ పూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా కీలక తీర్పునిచ్చారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు.
కానీ నిందితుడికి ఐపీసీ సెక్షన్ 354 ( మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 342 ( దురుద్దేశంతో నిర్భందించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను సమర్థించారామె. నిందితుల నేరాన్ని నిరూపించడానికి గట్టి సాక్ష్యాలు కావాలి. వారిపై తీవ్రమైన ఆరోపణలు ఉండాలని తీర్పునిచ్చారు.
బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా, దుస్తుల లోపలికి చేతులు పెట్టాడా అన్న నిర్థిష్టమైన వివరాలు లేవు. దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని చెప్పారు జడ్జి. అంతే దేశ వ్యాప్తంగా ఆ తీర్పు సంచలనమైంది.
నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్పా గనేడివాలా ఇచ్చిన తీర్పులపై చర్చ సాగుతోంది. ఫలితంగా సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పుష్ప గనేడివాలాకు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి హోదా కల్పించే అంశాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.
‘గనేడివాలా పై వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతలేదు. న్యాయమూర్తికి అవగాహన అవసరం. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఈ తరహా కేసులను వాదించి ఉండకపోవచ్చు. పుష్పకు అవగాహన, శిక్షణ అవసరం అని సుప్రీం వర్గాలు తెలిపాయి. శాశ్వత న్యాయమూర్తులను నియమించడం లేదా న్యాయమూర్తులను శాశ్వతంగా ఉంచే విధానాన్ని చేస్తోంది. ఇందులో భాగంగా కొలీజియం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి పంపుతోంది. ఆ సిఫార్సులను ఆమోదించడం అవసరమైతే కొన్నిసార్లు ఈ సిఫార్సులపై సందేహాలు వ్యక్తం చేస్తూ కేంద్రం తిప్పి పంపడం జరుగుతోంది.
ఇటీవలనే జస్టిస్ పుష్పా గనేడివాలాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శాశ్వత న్యాయూమూర్తిగా ప్రతిపాదిస్తూ జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. పుష్ప వివాదాస్పద తీర్పులను ఇవ్వడంతో శాశ్వత న్యాయమూర్తి హోదా అవకాశాలు తగ్గాయి. శరీరంపై దుస్తులు తొలగించకుండా బాలికను ఛాతిని తాకితే లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ జనవరి 19న తీర్పు ఇచ్చారామె. దీనిని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు పై స్టే విధించింది.
అంతే కాదు జనవరి 28న ఇచ్చిన తీర్పు పోక్సోచట్టం కింద మైనర్ బాలిక చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్ తెరవడం వంటి చర్యలు నేరాలుగా పరిగణించలేమని తీర్పునిచ్చారామె. భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్ కింద వీటిని లైంగిక వేధింపులుగా పరగణించవచ్చని చెప్పారు. ఐదేళ్ల బాలిక పై ఓ యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడికి శిక్ష పడలేదు. ఈ కేసులో జస్టిస్ గనేడివాలా నిందితుడిని వదిలి పెట్టారనే వాదన లేకపోలేదు.
1969లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని పరాత్ వాడలో జన్మించారు పుష్ప. బీకామ్, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేశారు గనేడివాలా. 2007లో జిల్లా జడ్జిగా నియామకం అయ్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టులో కొన్నాళ్ల పాటు పని చేశారు పుష్ప. ఆ తర్వాత నాగపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులోను పని చేశారు. ఆ తర్వాత నాగపూర్‌లోనే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా నియామకమయ్యారు. బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులవడంతో పాటు కీలక తీర్పునిచ్చారు పుష్ప.
2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కానీ న్యాయస్థానం వ్యతిరేకించడంతో పుష్ప కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించడంతో గనేడివాలాకు నిరాశ తప్పలేదు. కానీ 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారు కావడంతో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం వచ్చింది. కానీ శాశ్వత హోదా పుష్పకు లభించలేదు. ఈ క్రమంలో జనవరి 20న సుప్రీంకోర్టు జస్టిస్ పుష్పను పర్మినెంట్ చేస్తూ సిఫార్స్ చేసింది. పెరోల్‌కు సంబంధించి ఖైదీలకు ఉన్న పరిమిత హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. జస్టిస్ పీఎన్ దేశ్‌ముఖ్, జస్టిస్ మనీష్ పితాలేతో పాటు జస్టిస్ పుష్ప గనేడివాలా కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. ఖైదీలకు పెరోల్ ఇవ్వడం పరిమితమైన హక్కు మాత్రమేనని, మళ్లీ మళ్లీ ఓ ఏడాదిలో పెరోల్ తీసుకోరాదని తీర్పు నిచ్చారు.
2019లో ఓ హత్యానేరంలో దోషులకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఈ కేసులో తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ పుష్ప సభ్యురాలిగా ఉన్నారు. 2020 సెప్టెంబర్ కోవిడ్ ఆసుపత్రుల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారనే దాఖలైన పిటిషన్ ను జడ్డి పుష్ప విచారించారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆ కేసులో ప్రభుత్వాన్ని ఆదేశించారు. ముంబైలో ఫ్యామిలీ కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించాలని కోరడం అప్పట్లో సంచలనమైంది. వాయిదా పడిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను తిరిగి నిర్వహించాలని వచ్చిన పిటిషన్ ను పుష్ప కాదన్నారు. షెడ్యూల్ ప్రకారం జరిగిన పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి మాత్రం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
విషయం ఏదైనా ఇప్పుడు మరోసారి పుష్ప గనేడివాలా పేరు హాట్ టాపిక్ గా మారింది. తీర్పును అర్థం చేసుకోవడంలో తేడా ఉందా లేకపోతే పుష్ప ఆలోచనా తేరే వేరుగా ఉంటుందా అనే అంశం పై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప తీర్పులు బాగా ఉన్నాయని కొందరు అంటుంటే..కాదు కాదు నిందితులు తప్పించుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఏదైనా నిందితులు తప్పించుకోకుండా పుష్ప తీర్పులనిస్తే అంతే చాలంటున్నారు ఇంకొందరు.
(Disclaimer: రచయిత శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు. ఆర్టికల్‌లో రచయిత వివరించిన అంశాలు ఆయన సొంత అధ్యయనంలో వెల్లడైన విషయాలు. న్యాయమూర్తులను కించపరచాలన్న ఉద్దేశం టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌కు ఏ మాత్రం లేదు. అత్యున్నత న్యాయస్థానం వ్యక్తీకరించిన ఆదేశాల నేపథ్యంలోనే సంబంధిత న్యాయమూర్తి వెలువరించిన తీర్పు పూర్వాపరాలను ప్రచురించడం జరిగింది.)
ఇది కూడా చదవండి: ఆ మహిళా జడ్జికి శాశ్వత హోదాపై సిఫారసు ఉపసంహరణ, సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం.