WhatsApp Privacy Policy: వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీపై కేంద్ర స‌ర్కార్ ఆగ్ర‌హం.. హైకోర్టులో విచార‌ణ‌

| Edited By: Pardhasaradhi Peri

Jan 26, 2021 | 7:41 AM

WhatsApp Privacy Policy: నూత‌నంగా తీసుకువ‌చ్చిన‌ వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీపై భార‌త‌ యూజ‌ర్లు విచారం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాల‌సీ తీసుకొచ్చాక...

WhatsApp Privacy Policy: వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీపై కేంద్ర స‌ర్కార్ ఆగ్ర‌హం.. హైకోర్టులో విచార‌ణ‌
Follow us on

WhatsApp Privacy Policy: నూత‌నంగా తీసుకువ‌చ్చిన‌ వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీపై భార‌త‌ యూజ‌ర్లు విచారం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాల‌సీ తీసుకొచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగ‌దారులు సిగ్న‌ల్‌, టెలిగ్రామ్ వంటి మెసెంజ‌ర్ యాప్‌ల‌కు వెళ్తున్నారు. ఎక్కువ మంది సోష‌ల్ మీడియాలో వాట్సాప్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీపై ఓ లాయర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా కేంద్ర స‌ర్కార్ వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

యూరోపియ‌న్ వినియోగ‌దారులు, భార‌త్ వినియోగ‌దారులను వాట్సాప్ వేర్వేరుగా చూస్తోంద‌ని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త పాల‌సీ నిబంధ‌న‌ల‌కు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని వాట్సాప్‌కు లేఖ పంపిన‌ట్లు విచార‌ణ సంద‌ర్భంగా అడిష‌న‌ల్ సోలిట‌ర్ జ‌న‌ర‌ల్ చేత‌న్ శ‌ర్మ కోర్టుకు వివ‌రించారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్ భార‌తీయ వినియోగ‌దారుల గోప్య‌తా విష‌యంలో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హైకోర్టుకు నివేదించింది.

కాగా, యూరోపియ‌న్‌లో వ్య‌క్తిగ‌త స‌మాచారం షేర్ చేసుకోవ‌డం నేరం కావ‌డంతో అక్క‌డ త‌ప్ప‌నిస‌రిగా వాట్సాప్ రూల్స్‌ను అంగీక‌రించాల‌నే నిబంధ‌న‌లేదు. కానీ భార‌త్‌లో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు తీసుకురావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని చేత‌న్‌శ‌ర్మ కోర్టుకు తెలిపారు.

ఈ అంశం వినియోగదారుల స‌మాచారం భ‌ద్ర‌త‌, గోప్య‌త‌కు భంగ‌మ‌ని కోర్టుకు తెలిపారు. అయితే ప్ర‌భుత్వం కోరిన వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్పందిస్తామ‌ని వాట్సాప్ త‌ర‌పున హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచార‌ణ‌ను మార్చి 1కి వాయిదా వేసింది హైకోర్టు.

Also Read: Telecom Industry: లైసెన్స్ ఫీజులు త‌గ్గించాలి… జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని టెలికాం కంపెనీల డిమాండ్‌…