Digital Arrest: ఫేక్ పోలీస్ కాల్స్‌తో రూ. కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు.. మీకూ ఇలాంటి ఫోన్లు వస్తే ఇలా చేయండి

| Edited By: Srilakshmi C

Nov 19, 2024 | 8:26 PM

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట 'డిజిటల్ అరెస్ట్'. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలకు బదులు నేరుగా టార్గెట్ పర్సన్ కి కాల్ చేసి తాము పోలీసులమని చెప్పి భయపెట్టే విధంగా మాట్లాడుతారు. మీపై కేసులు రాకుండా ఉండాలంటే కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలుకుతారు. మీరు వారి మాటలు నమ్మారో వారి వలలో పడ్డట్లే..

Digital Arrest: ఫేక్ పోలీస్ కాల్స్‌తో రూ. కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు.. మీకూ ఇలాంటి ఫోన్లు వస్తే ఇలా చేయండి
Digital Arrest Scam
Follow us on

సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ నేరగాళ్లు ట్రెండ్ ని మార్చుకుంటున్నారు. మొన్నటివరకు ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లింకులతో ఎకౌంట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు అధికారాన్ని మోసానికి అడ్డం పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఓటీపీల కాలం పోయింది. అకౌంట్‌లో నుంచి తెలియకుండా డబ్బు పోయే రోజులు పోయి.. నేరుగా జనమే తమ డబ్బుల్ని పోగొట్టుకునే రోజులు వచ్చాయి. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా? అదే డిజిటల్ అరెస్టులు. గత కొద్దిరోజులుగా బెజవాడ వ్యాప్తంగా అనూహ్యంగా డిజిటల్ అరెస్టుల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ ను ఎంచుకుని మరి లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. అవకాశం ఉన్న వరకు టార్గెట్ చేసిన వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈలోపే తేరుకుంటే సరే సరి. ఎంతోకొంత మిగులుచుకున్నట్టు. లేదంటే ఉన్న డబ్బు అంతా పోగొట్టుకున్నట్లె.. ఇంతకీ విషయం ఏంటంటే..

డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏమిటి?

ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ నుంచి పోలీసులమంటూ ఓ ఫోన్ చేస్తారు. మీకు పార్సిల్ వచ్చింది.. ఈ పార్సిల్ లో డ్రగ్స్ లాంటి మారకద్రవ్యాలు ఉన్నాయని మిమ్మల్ని అరెస్టు చేయాలంటారు. పార్సిల్ ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని డీటెయిల్స్ చెప్పకనే చెప్తారు. దాన్ని నమ్మిన పబ్లిక్ వెంటనే భయాందోళనకు గురవుతారు. ఎవరు ఏం చేయలేరంటూ ఇంకా భయపడతారు. ఇది ఆలోచించుకునే గ్యాప్ లోనే మరో కాల్ చేస్తారు. మరో డిపార్ట్మెంట్ నుంచి అంటూ ఇంకా భయపడతారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని ఇంకో కాల్ చేసి వారే అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బు కట్టాలంటూ అవకాశం కల్పించినట్టు మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా అప్పటికే భయానికి గురైన పబ్లిక్ ఆ మాటను నమ్మి ఎందుకు వచ్చిందిలే తలనొప్పి అనుకుని ఎంతోకొంత అమౌంట్ వేయడం మొదలు పెడతారు. అలా లక్షతో మొదలై అదికాస్త పది లక్షల దాటి కోటి వరకు వెళ్లిన కేసులు కూడా ఉన్నాయి. తాజాగా విజయవాడ పరిధిలో ఇలాంటివి వారానికి ఐదు కేసులు పైగానే నమోదు అవుతున్నాయి.

కోట్లు పోగొట్టుకున్న బాధితులు

కొద్దిరోజుల క్రితం భారతి నగర్‌లో ఓ మహిళ ఒకేసారి రూ. 50 కోట్లు పోగొట్టుకుంది. ఇంకొకతను రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. చాలామంది అనుమానంతో ఫోన్ల మధ్యలోనే స్టేషన్ కి వస్తే మరికొంతమంది డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాక స్టేషన్ కి వస్తున్నారు. సో ఇలాంటి కేసులు పెరుగుతూ ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ మోసాల్లో డబ్బులు పోయిన తర్వాత తిరిగి తీసుకురావడం అసాధ్యం. కొంత మేర 40 శాతం మాత్రమే రికవరీ అవుతుంది. మిగతాది పోయినట్టే. కాబట్టి పోవడానికి ముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటూ సూచనలు జారీ చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా స్థానిక పోలీసుల్ని అప్రోచ్ అవ్వాలంటున్నారు. వీటికి అడ్డుకట్ట పడాలంటే బ్యాంక్ లతో పాటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు రియాక్ట్‌కావొద్దు

నిత్యం వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యం. సైబర్ ద్వారా జరిగే నేరాలను అవగాహన ద్వారానే వేగంగా అడ్డు కట్ట వెయ్యగలుగుతం. ఈ మధ్యకాలంలో అత్యధికంగా సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్ కేసుల్లో వారి ప్రేమేయం ఉన్నట్లు నమ్మించి, అమాయకులను మోసం చేస్తున్నారు. ఆపరాద రుసుము చెల్లించమని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తు మోసపోతున్న అమాయకులు బ్యాంకులకు వచ్చి వారి సేవింగ్స్ అకౌంట్ నుండి ఇతర రాష్ట్రల కరెంటు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలనీ బాంకు అధికారులను అడుగుతున్నారు. ఇలాంటి సందర్భాలలో బ్యాంక్స్ పోలీస్ ఇచ్చిన ప్రశ్నవలి వారికి వివరించి తదుపరి పూర్తి వివరాలను సేకరించి పోలీస్ వారికి తెలియజేసినప్పుడు కాస్త నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది.

అయితే ఎవరైనా కస్టమర్స్ కంగారుగా బ్యాంక్ కు వచ్చి అధిక మొత్తంలో ట్రాన్స్ఫర్ చేయమని వస్తే.. బ్యాంకు మేనేజర్లు అడగాల్సిన ముఖ్య ప్రశ్నలు ఏంటంటే.. ఈ లావాదేవీ వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా?డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి చేశారా? సీబీఐ, కస్టమ్స్, పోలీస్ పేరుతో వీడియో కాల్ వచ్చిందా? అని వారిని పోలీసులు ఇచ్చిన ప్రశ్నవలిలో ప్రశ్నలను అడగల్సి ఉంటుంది. అంతేకాకుండా అనుమానాస్పద లావాదేవీలను నిలిపి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బెదిరింపులకు గురైన కస్టమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చెయ్యాలి. కస్టమర్‌ను సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పాలి. అదేవిధంగా ఎవరైనా భాదితులు వచ్చి తన ఎకౌంటు లో తనకు తెలియకుండా డబ్బులు పోయియని చెప్పినప్పుడు వారి డబ్బులు ఏ ఎకౌంటు కు వెళ్లాయో వారికి తెలియచెయ్యాల్సి ఉంటుంది.

పబ్లిక్‌ తెలుసుకోవల్సిన విషయాలు

  • ప్రభుత్వ సంస్థలు వీడియో కాల్స్ లేదా మెసేజ్‌లు ద్వారా అరెస్టులు చేయవు.
  • OTPలు లేదా బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.
  • తెలియని లావాదేవీలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
  • బ్యాంకులు, ప్రజల సహకారం ద్వారా డిజిటల్ అరెస్ట్ మోసాలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి.
  • మీ బ్యాంకు, వ్యక్తిగత వివరాలను తెలియని వారు ఎవరితోనూ పంచుకోకూడదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.