
సోషల్ మీడియా రీల్స్ పిచ్చి రోజురోజుకూ పెరిగిపోతోంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు చేసే పనులు విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా సముద్ర తీరంలో ఓ జంట రీల్స్ చిత్రీకరణలో మునిగిపోయి తమ చిన్నారి పాపను పట్టించుకోలేదనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అలల తాకిడికి పాప ఇబ్బంది పడుతున్నా గమనించకపోవడంతో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి చిన్నారిని రక్షించినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట సముద్ర తీరంలో నడుచుకుంటూ రీల్స్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారి వెంట ఉన్న చిన్నారి పాప చేతులను తల్లి పట్టుకుని నడిపిస్తోంది. అయితే కొద్దిసేపటికే పాప తల్లి చేతి నుంచి జారిపోయి ఇసుకపై పడిపోయింది. ఆ సమయంలో మహిళ వెనక్కి తిరిగి చూసినప్పటికీ, మళ్లీ కెమెరా వైపు తిరిగి పోజులివ్వడం ప్రారంభించినట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు, ఆ వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో వీడియో చిత్రీకరిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో సముద్రపు అలలు చిన్నారిని తాకుతూ ఆమెను అటూ ఇటూ నెట్టడం కనిపించింది. అయినప్పటికీ, దంపతులు తమ వీడియో చిత్రీకరణలోనే నిమగ్నమైనట్లు ఆ దృశ్యాలు చూపిస్తున్నాయి.
చివరకు అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిన్నారిని గమనించి వెంటనే దగ్గరకు వెళ్లాడు. పాప చేతిని పట్టుకుని అలల నుంచి దూరంగా తీసుకెళ్లి తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. జరిగిన విషయాన్ని వారికి తెలియజేస్తూ అప్రమత్తం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను మరియం అనే ఎక్స్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. తన భర్తతో కలిసి సముద్ర తీరానికి వెళ్లినప్పుడు ఈ ఘటనను గమనించినట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. రీల్ చిత్రీకరణలో మునిగిపోయిన దంపతులు తమ చిన్నారిని నీటిలో వదిలేశారని, అలలు పాపను కొట్టుకుపోయేలోపే అక్కడున్న వ్యక్తి స్పందించి ఆమెను కాపాడినట్లు ఆమె ఆరోపించారు. రీల్స్ చేయడం అంత ముఖ్యమైపోయిందా? సొంత పిల్లలను కూడా పట్టించుకోని పరిస్థితి వచ్చిందా? అంటూ ఆమె సోషల్ మీడియా వ్యామోహంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పిల్లల భద్రత కంటే సోషల్ మీడియా కంటెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. మరికొందరు రీల్ కోసం కుటుంబాన్నే మరిచిపోయే స్థాయికి కొందరు చేరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. వీడియో కొన్ని నిమిషాలే ఉంటుంది కానీ, చిన్నారి జీవితం అలా కాదని పేర్కొన్నారు. సమయానికి ఓ వ్యక్తి స్పందించడం వల్లే ప్రమాదం తప్పిందని మరొకరు అభిప్రాయపడ్డారు. పిల్లల భద్రత అన్నింటికంటే ముఖ్యం. ముఖ్యంగా సముద్ర తీరాలు, నదులు, ఈత కొలనుల వంటి ప్రాంతాల్లో చిన్నారులను క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.