
ఉత్తరప్రదేశ్, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సైఫాయ్ బ్లాక్ పరిధిలో ఉన్న బిరౌలి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న దినేశ్ కుమార్ మాథుర్ తరగతి గదిలో విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చున్నాడు. విద్యార్థులంతా నేలపై కూర్చొని ఉండగా, ఒక చిన్నారి ఆయన ఎదురుగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి గుండు చేసిన తలపై చేతులతో తబలా వాయిస్తున్నట్లుగా ఉపాధ్యాయుడు నటించాడు. అలా చేస్తూ పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఈ దృశ్యాలను ఎవరు చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వీడియోను ఉపాధ్యాయుడే తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా బేసిక్ శిక్షా అధికారి (BSA) డాక్టర్ రాజేశ్ కుమార్ తక్షణమే స్పందించారు. విద్యార్థితో ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటూ దినేశ్ కుమార్ మాథుర్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరికి ఈ ఘటన సరదాగా అనిపించినప్పటికీ, ఆ చిన్నారి మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. ఇతరుల ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థి అవమానంగా భావించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ‘ఇందులో నవ్వుకోవాల్సింది ఏమీ లేదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ఇలాంటి చర్యలు పిల్లల్లో అభద్రతా భావాన్ని కలిగించవచ్చని మరొకరు పేర్కొన్నారు.
మరో నెటిజన్ స్పందిస్తూ.. పిల్లల మానసిక స్థితిపై ఇలాంటి సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో పెద్దలు గుర్తించాలని అన్నారు. విద్యార్థులను ఆదరంగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కలిగి ఉంటారు. సరదా పేరుతో చేసే పనులు చిన్నారులను ఇబ్బందికి గురిచేయకుండా జాగ్రత్తపడాలి. ఈ ఘటనతో పాఠశాలల్లో పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన, వారి మానసిక భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.