రిసెప్షన్‌లో అందరితో నవ్వుతూ ఫోటోలు.. నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయిన పెళ్లికొడుకు!

నిన్నటి వరకు పెళ్లి సందడి.. నేడు అంతులేని విషాదం! షెహనాయ్ నాదాలు, బంధుమిత్రుల సందడి, కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. ఇలా ఎంతో ఆనందంగా సాగిన ఓ వివాహ వేడుక ఒక్కసారిగా విషాదాంతమైంది. పెళ్లయిన మరుసటి రోజే రిసెప్షన్ వేడుకలో వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోటోషూట్ పూర్తయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రిసెప్షన్‌లో అందరితో నవ్వుతూ ఫోటోలు.. నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయిన పెళ్లికొడుకు!
Bihar News

Updated on: Nov 27, 2026 | 9:47 PM

నిన్నటి వరకు పెళ్లి సందడి.. నేడు అంతులేని విషాదం! షెహనాయ్ నాదాలు, బంధుమిత్రుల సందడి, కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. ఇలా ఎంతో ఆనందంగా సాగిన ఓ వివాహ వేడుక ఒక్కసారిగా విషాదాంతమైంది. పెళ్లయిన మరుసటి రోజే రిసెప్షన్ వేడుకలో వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోటోషూట్ పూర్తయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొత్తగా పెళ్లైన వధువు జీవితంలో ఊహించని విషాదం నిండిపోయింది.

రిసెప్షన్ వేడుకలో ఒక్కసారిగా కుప్పకూలిన వరుడు

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పోథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోథియా బజార్ 13వ వార్డుకు చెందిన డాక్టర్ పవన్ కుమార్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పాట్నాలో విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్‌కు నవంబర్ 25న పొరుగున ఉన్న చంద్‌పూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది.

వివాహ వేడుక అనంతరం నూతన వధూవరులకు స్వాగతం పలికేందుకు నవంబర్ 26న కుటుంబ సభ్యులు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు, స్థానికులతో ఇల్లు సందడిగా మారింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు అతిథులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ క్రమంలో వరుడు పవన్ కుమార్ తన భార్యతో కలిసి వేదికపై కూర్చుని ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. అతిథులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆనందంగా కనిపించారు. అయితే ఫోటోషూట్ పూర్తయిన వెంటనే ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. చూస్తుండగానే వేదికపైనే కుప్పకూలిపోయారు.

ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి

అప్పటివరకు ఆనందంగా సాగుతున్న వేడుక ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఏం జరిగిందో అర్థంకాక కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పవన్ కుమార్‌ను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పూర్నియాకు తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పూర్నియాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పవన్ కుమార్ తుదిశ్వాస విడిచారు. ప్రాథమికంగా తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, మృతికి అసలు కారణం వైద్యపరంగా ఇంకా నిర్ధారణ కాలేదు.

కాళ్ల పారాణి ఆరకముందే వధువుకు తీరని శోకం!

ఈ ఘటనలో అందరినీ ఎక్కువగా కలచివేస్తున్న విషయం కొత్త వధువు పరిస్థితి. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త, పెళ్లయిన ఒక్కరోజుకే తనను విడిచిపెట్టడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. చేతులకు పెట్టుకున్న గోరింటాకు కూడా పూర్తిగా ఆరకముందే ఆమె జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. కొత్త కోడలికి ఘనంగా స్వాగతం పలికి, కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆశించిన బంధువులు ఇప్పుడు ఆమెను ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్నటి వరకు పెళ్లి పాటలతో మారుమోగిన ఆ ఇల్లు నేడు కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయింది.

పవన్ కుమార్ ఆకస్మిక మరణవార్తతో పోథియా బజార్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సంబరాలు ముగియకముందే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక కొత్త జీవితానికి ఆరంభం కావాల్సిన రోజు.. ఓ కుటుంబానికి జీవితాంతం మరిచిపోలేని విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us