మరోసారి మనసువిప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆనందం, భావోద్వేగం కలగలిపి ఈ ఏడాది తొలి మన్‌కీ బాత్‌లో స్పందించారు. ఎర్రకోట ఘటన నుంచి ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం దాకా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్ని అంశాలనూ గుర్తుచేసుకున్నారు. గణతంత్ర దినోత్సవరం రోజున ఎర్రకోట సాక్షిగా జరిగిన ఘటనలపై మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. కిసాన్ పరేడ్‌లో జరిగిన హింస బాధ కలిగించిందన్నారు. ఎర్రకోట ఘటనను ఖండించారు. త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసిందన్నారు.
ఇక కరోనాపై పోరాటం కొనసాగుతోందని, కోవిడ్ మహమ్మారికి ఏడాది పూర్తయిందని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోందని, 15 రోజుల్లోనే 30 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశామని ప్రధాని చెప్పారు. ప్రపంచదేశాలకు మేడిన్ ఇండియా వ్యాక్సిన్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకని, దాన్ని ప్రపంచానికి సరఫరా చేయడం అందరికీ గర్వకారణమని మోదీ చెప్పారు. ఈ విషయంలో భారత్‌ను చాలా దేశాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్ట్ క్రికెట్ సిరీస్ గెలవడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన జట్టు సమష్టి కృషితో హార్డ్‌వర్క్ చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న నేపథ్యంలో రచయితలకు పిలుపునిచ్చారు ప్రధాని. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి, ఆయా ప్రాంతాల్లో వారి తెగువ, పరాక్రమాల గురించి ముఖ్యంగా యువ రచయితలు కలాలకు పదునుపెట్టాలన్నారు. మీ రచనలే సమరయోధులకు ఘనమైన నివాళి అని మోదీ అన్నారు.
మన్‌కీ బాత్‌లో .. హైదరాబాద్ బోయిన్‌పల్లి సబ్జీ మండి గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయన్నారు. బోయిన్‌పల్లి సబ్జీ మండిలో ప్రతిరోజు 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, 30 కిలోల జీవ ఇంధనంతో పాటు 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ప్రధాని తెలిపారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. మన దేశానికి చెందిన నలుగురు మహిళా పైలెట్లు అమెరికా నుంచి బెంగళూరుకు విమానాన్ని నడిపి..225 మందిని గమ్యస్థానానికి చేర్చారని గుర్తుచేశారు. దేశంలో మహిళాశక్తి పురోగతికి ఇదో నిదర్శనమని ప్రధాని చెప్పుకొచ్చారు.