Economic Vaccine : కరోనా దెబ్బకి దాదాపుగా అన్ని రంగాలు డీలాపడ్డాయి. పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కోట్లమంది ఉపాధికి దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే కాలూచేయీ కూడదీసుకుంటున్న వ్యవస్థలు..కేంద్ర బడ్జెట్‌వైపు ఆశగా చూస్తున్నాయి. ఆర్థికసంక్షోభానికి నిర్మలమ్మ బడ్జెట్ భరోసా కల్పించాలనుకుంటున్నాయి. ఎప్పుడూ చూడనటువంటి బడ్జెట్ అంటూ..పోయిన నెలలో టీజర్ వదిలారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
దీంతో బడ్జెట్ కూర్పుపై ఆశలు పెరిగాయి. ఏటా ఆదాయపు పన్ను రాయితీకోసం చకోర పక్షుల్లా ఎదురుచూసే వేతన జీవులనుంచి మొదలుకుని.. పదిమందికీ ఉపాధికల్పించే చిన్నాచితకా పరిశ్రమలదాకా అందరికీ ఎవరి అంచనాలు వారికున్నాయి. కరోనా సంక్షోభ ప్రభావం లేని రంగమే లేదు.
కాస్త ఎక్కువా తక్కువా అంతే. ఈ బడ్జెట్‌లో రాయితీలు, వరాలిస్తేనే మళ్లీ అన్ని వ్యవస్థలూ కోలుకుంటాయి. ప్రతీ రంగాన్నీ సంతృప్తిపరిచేలా బడ్జెట్ రూపొందించడం నిర్మలమ్మకు కూడా సవాలే. తీవ్రమైన మాంద్యం, ఎప్పుడూలేనంత నిరుద్యోగ రేటుతో ఎన్నో రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ఆర్థికమంత్రికి ఈసారి బడ్జెట్ కత్తిమీద సామే.
కరోనాతో కోట్ల ఉద్యోగాలు పోయాయి. వేతనాల్లో కోతపడింది. పరిశ్రమలు, సంస్థలు మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి. ఈ సంక్షోభ సమయంలో బడ్జెట్‌లో ఆదాయపు పన్నులో రాయితీలు కోరుకుంటున్నారు ఉద్యోగులు. ఈసారి కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గృహ నిర్మాణ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా.. నిర్ణయాలు ప్రకటించవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలున్నాయి. రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న సమయంలో.. వ్యవసాయ రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. మరీ ముఖ్యంగా…కోవిడ్‌తో పారిశ్రామికరంగం తీవ్రస్థాయిలో నష్టపోయింది. సుదీర్ఘకాలం లాక్‌డౌన్, కార్మికుల వలసలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయి.
దీంతో ఎంఎస్ఎంఈ సెక్టార్‌పై ఈసారి బడ్జెట్ ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రజల కొనుగోలుశక్తి పెరిగేలా నిర్మలమ్మ బడ్జెట్ ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి బడ్జెట్ పత్రాలు ముద్రించలేదు. కరోనాని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ కాపీలు అందించబోతున్నారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..