Fuel Price Issue: ఆ 26 లక్షల కోట్ల ఆదాయం ఏటు పోయింది?.. మోదీపై విరుచుకుపడిన విపక్షాలు..!

Fuel Price Issue: వ్యాట్‌ తగ్గించకపోవడంతోనే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉన్నాయని విపక్షాలపై

Fuel Price Issue: ఆ 26 లక్షల కోట్ల ఆదాయం ఏటు పోయింది?.. మోదీపై విరుచుకుపడిన విపక్షాలు..!
Modi Vs Didi
Follow us

|

Updated on: Apr 27, 2022 | 10:12 PM

Fuel Price Issue: వ్యాట్‌ తగ్గించకపోవడంతోనే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉన్నాయని విపక్షాలపై ప్రధాని మోదీ చేసిన విమర్శలపై రచ్చ జరుగుతోంది. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో దేశంలో అత్యధిక వ్యాట్‌ విధిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. పెట్రోధరల పెంపుతో వచ్చిన రూ. 26 లక్షల కోట్ల ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు వాటా ఇవ్వడం లేదని నిలదీసింది.

అంతకు ముందు కరోనాపై సీఎంలతో సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినప్పటికీ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించడం లేదని విమర్శించారు. దీంతో ఆ రాష్ట్రాల ప్రజలపై అధిక భారం పడుతోందని ఆరోపించారు మోదీ. రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్లే పెట్రో ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారాయన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్‌ స్ఫూర్తితో పనిచేసినప్పుడు దేశంలో పెట్రోధరలు అదుపులోకి వస్తాయన్నారు. బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్‌ రాష్ట్రాలు వెంటనే వ్యాట్‌ను తగ్గించి పెట్రో ధరలను అదుపు చేయాలని సూచించారు ప్రధాని మోదీ. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోధరలపై వ్యాట్‌ తగ్గించినప్పటికి.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం తగ్గించడం లేదన్నారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించిన కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో వేల కోట్లు నష్టపోతుంటే.. ఆ రాష్ట్రాలకు పొరుగున ఉన్న రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకుండా వేల కోట్లు లాభాలు పొందుతున్నాయని విమర్శించారు.

అయితే మోదీ ఆరోపణలకు అదే రీతిలో కౌంటరిచ్చాయి విపక్షాలు. పెట్రో ఉత్పత్తులపై దేశంలో అత్యధిక వ్యాట్‌ బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలోనే ఉందన్న విషయాన్ని ప్రధాని మోదీ మర్చిపోయారని కాంగ్రెస్‌ విమర్శించింది. పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకంతో కేంద్రం సంపాదించిన రూ.26 లక్షల కోట్లలో రాష్ట్రాలకు వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా. జీఎస్‌టీ వాటాను రాష్ట్రాలకు సకాలంలో ఇవ్వడం లేదని, రాష్ట్రాలను వ్యాట్ తగ్గించుకోవాలని ప్రధాని మోదీ అడగడం విడ్డూరంగా ఉందంటూ దుమ్ము దులిపారు ఖేరా. ‘‘పెట్రోధరలపై ఎక్సైజ్‌ డ్యూటీతో కేంద్రం రూ. 26 లక్షల కోట్లను సంపాదించింది. దాని నుంచి రాష్ట్రాలకు వాటా ఇచ్చారా? రూ. 26 లక్షల కోట్ల లెక్కలు చెబుతారా? జీఎస్టీటీలో రాష్ట్రాల వాటాను మీరు సరైన సమయంలో రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. అది రాజ్యాంగం మీకు ఇచ్చిన బాధ్యత.. అది మరిచి ఇప్పుడు రాష్ట్రాలను వ్యాట్‌ తగ్గించమని కోరుతారా? మీరే సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలి.’’ అని ఖేరా ఫైర్ అయ్యారు.

ఇక బెంగాల్‌ సీఎం మమత కూడా ప్రధాని మోదీ ప్రకటనపై మండిపడ్డారు. రాష్ట్రాలను బెదిరించాలని చూస్తే బెదిరే ప్రసక్తే లేదన్నారు దీదీ. కేంద్రం నుంచి బెంగాల్‌కు 90 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే కూడా ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీలో కేంద్రం వాటా ఎక్కువని , రాఫ్ట్రాలకు తక్కువన్నారు ఉద్దవ్‌. దేశంలో ట్యాక్స్‌ల రూపంలో మహారాష్ట్ర నుంచే ఎక్కువ ఆదాయం వెళ్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధాని మోదీ ప్రకటనపై నిప్పులు చెరిగారు. సెస్సులో పేరుతో చమురు ధరలు పెంచేది మీరు.. పైగా రాష్ట్రాలు తగ్గించమని కోరుతారా? అంటూ ధ్వజమెత్తారు. డీఎంకే కూడా ప్రధాని మోదీ తీరుపై మండిపడింది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు డీఎంకే నేతలు.

Also read:

Solar Magic: ఆకాశంలో అద్భుతం.. వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ దృశ్యం ఎప్పుడు కనిపించనుందంటే..

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Shocking News: 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాల తయారీ.. రెస్టారెంట్ సీజ్.. ఎక్కడో తెలుసా?..