
NPS వాత్సల్య పథకం పిల్లల దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఈ ఖాతా నుండి 18 ఏళ్ల కంటే ముందే నగదు ఉపసంహరణకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఖాతా ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన తర్వాతే విద్యావసరాలు, వైద్య ఖర్చులు లేదా వైకల్యం వంటి అత్యవసర పరిస్థితులకు మాత్రమే జమ చేసిన మొత్తం నుండి గరిష్టంగా 25శాతం వరకు పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఇది సాధారణ NPS టయర్-1 ఖాతాగా మారుతుంది. అంటే ఏమిటి..? ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
NPS వాత్సల్య ఖాతాను అత్యవసర నిధి లాగా ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి వీలులేదు. ముందస్తు ఉపసంహరణలపై కఠిన పరిమితులు ఉన్నాయి:
లాక్-ఇన్ పీరియడ్: ఖాతా ప్రారంభించిన కనీసం 3 సంవత్సరాల తర్వాతే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
ఉపసంహరణ పరిమితి: తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జమ చేసిన అసలు మొత్తంలో గరిష్టంగా 25శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై వచ్చిన లాభాలు/రిటర్న్ ఆ లెక్కింపులోకి రావు.
నిర్దిష్ట కారణాలు: పిల్లల ఉన్నత చదువులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యల చికిత్స లేదా 75శాతం కంటే ఎక్కువ వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ఈ డబ్బును తీసుకోవచ్చు.
పరిమితి: పిల్లలకు 18 ఏళ్లు వచ్చేలోపు గరిష్టంగా 3 సార్లు మాత్రమే పాక్షికంగా నగదు వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది.
పిల్లలకు 18 ఏళ్లు నిండిన వెంటనే NPS వాత్సల్య ఖాతా సాధారణ NPS టయర్-I ఖాతాగా మారుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత సదరు వ్యక్తి ఖాతాను కొనసాగించవచ్చు లేదా నిష్క్రమించవచ్చు.
రూ. 8 లక్షల లోపు కార్పస్: మొత్తం జమ అయిన నిధి రూ. 8 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, 100శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే: కార్పస్ రూ. 8 లక్షలు దాటితే, కనీసం 20శాతం మొత్తాన్ని పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 80శాతం మొత్తాన్ని లంప్‌సమ్‌గా ఉపసంహరించుకోవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80CCD(1B) కింద NPS వాత్సల్యలో తల్లిదండ్రులు చేసే డిపాజిట్లకు సంవత్సరానికి రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. సమర్థవంతమైన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు NPS వాత్సల్య చాలా మంచి ఎంపిక. కానీ ఉపసంహరణ నిబంధనలు కఠినంగా ఉన్నందున, రోజువారీ లేదా స్వల్పకాలిక అత్యవసరాల కోసం దీన్ని కాకుండా, పిల్లల భవిష్యత్తు నిధిగా మాత్రమే పరిగణించడం ఉత్తమం.