మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్‌.. తుదిరూపు ఇచ్చే పనిలో నిర్మలా సీతారామన్‌ బిజీ

|

Jan 22, 2021 | 5:09 PM

ఆర్థికవేత్తలతో విస్తృత సంప్రదింపులు జరిపి బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చే పనిలో ఆర్థిక మంత్రి బిజీగా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రూపొందిస్తున్న..

మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్‌.. తుదిరూపు ఇచ్చే పనిలో నిర్మలా సీతారామన్‌ బిజీ
Follow us on

మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌-2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఆర్థికవేత్తలతో విస్తృత సంప్రదింపులు జరిపి బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చే పనిలో ఆర్థిక మంత్రి బిజీగా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రూపొందిస్తున్న ఈ బడ్జెట్‌ కోసం అన్ని తరగతుల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఈసారి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. తద్వారా ప్రస్తుత కరోనా సమయంలో ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును ఆదా చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. ప్రజల చేతుల్లో నగదు ఉంటే ఏదో విధంగా వారు ఖర్చు చేసే వీలుంటుంది. తద్వారా దేశీయంగా ద్రవ్య వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది.

కరోనా కాలంలో పీఎం కేర్స్‌ ఫండ్ సృష్టించారు. ఈ ఫండ్‌కు విరాళం ఇచ్చిన వారికి సెక్షన్‌ 80జి కింద 100% పన్ను రాయితీ పొందే సౌలభ్యం ఉంది. అయితే కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుపై మాత్రం మినహాయింపు లభించదు. ప్రస్తుతం, సెక్షన్ 80 యు మరియు 80 డిడి (అంటే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్) కింద, వైకల్యంతో సహా కొన్ని వ్యాధులపై తగ్గింపు ప్రయోజనం ఉంది. ఈ బడ్జెట్‌లో కరోనా చికిత్సపై పన్ను ప్రయోజనం కోసం ఒక విభాగాన్ని ప్రకటించే అవకాశం ఉంది. లేదా కరోనా చికిత్సను ప్రస్తుత విభాగంలో చేర్చడానికి అవకాశం ఉంది లేదంటే కరోనా వ్యాధికి లేదా వైద్య బీమాకు సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పన్ను ఉపశమనాన్ని ప్రకటించవచ్చు.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. అంతే కాకుండా మధ్యతరగతి వారికి ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు రెట్టింపు చేయవచ్చని తెలుస్తుంది.

కరోనా మహమ్మారి రాకతో దేశంలో జీవన విధానంలో సమూల మూర్పులు చోటు చేసుకున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఖర్చులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రకాల రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెక్షన్ 80 సి పన్ను పొదుపులో అత్యంత కీలకం. ఈ సెక్షన్‌ కింద అనేక రకాల పెట్టుబడులు చేర్చినప్పటికీ దాని పరిధి చాలా పెద్దదిగా ఉంది. అయితే పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.