NDA Meet: హర్యానా గెలుపుతో ఫుల్‌ జోష్‌లో బీజేపీ.. పొలిటికల్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తున్న కమలం స్ట్రాటజీ

|

Oct 17, 2024 | 10:48 AM

హర్యానాలో అదరగొట్టాం.. జరగబోయే మహారాష్ట్ర మల్లయుద్ధంలో గెలిచితీరాలి.. జార్ఖండ్‌లోనూ దుమ్మురేపాలంటూ కమలం పార్టీ ఫుల్‌ జోష్‌లో ఉంది. హర్యానా విక్టరీని రెండు రాష్ట్రాల్లోనూ రిపీట్‌ చేయాలంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.

NDA Meet: హర్యానా గెలుపుతో ఫుల్‌ జోష్‌లో బీజేపీ.. పొలిటికల్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తున్న కమలం స్ట్రాటజీ
Nda Meet
Follow us on

హర్యానాలో అదరగొట్టాం.. జరగబోయే మహారాష్ట్ర మల్లయుద్ధంలో గెలిచితీరాలి.. జార్ఖండ్‌లోనూ దుమ్మురేపాలంటూ కమలం పార్టీ ఫుల్‌ జోష్‌లో ఉంది. హర్యానా విక్టరీని రెండు రాష్ట్రాల్లోనూ రిపీట్‌ చేయాలంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇవాళ హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం అయిపోగానే.. అక్కడే ఎన్డీయే మీటింగ్‌కు ప్లాన్‌ చేశారు బీజేపీ పెద్దలు. ఇంతకీ ఈ ఎన్డీయే మీటింగ్‌ దేనికి సంకేతం…? మహారాష్ట్ర, జార్ఖండ్‌ జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు..? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.

మొన్నటి హర్యానా ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాడింది. ఎగ్జిట్‌పోల్స్‌ను బోల్తా కొట్టించి… బిగ్‌ విక్టరీ కొట్టింది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ… హ్యాట్రిక్‌ విజయం సాధించింది. ఇప్పుడితే ఊపును రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది కాషాయం పార్టీ. అందుకు కమలం పెద్దలు ఓ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్ట్రాటజీ ప్లే చేస్తు్న్నారు.

గురువారం(అక్టోబర్ 17) హర్యానా సీఎంగా నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణం చేస్తారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా నయాబ్‌ సింగ్‌ సైనీ ఎన్నికవ్వడంతో.. రెండోసారి హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లో జరిగే ప్రమాణస్వీకారానికి బీజేపీ పెద్దలతో పాటు ఎన్టీఏ కూటమి నేతలు హాజరవుతారు. ఇక ముఖ్యమంత్రి ప్రమాణం అలా పూర్తవ్వగానే.. ఇలా ఎన్డీయే మీటింగ్‌ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే మీటింగ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. రాబోవు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది బీజేపీ. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు గతంలో సుదీర్ఘ కాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌కూ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమనే చెప్పాలి. ఇటు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తుంటే… మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఎన్డీయే మీటింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా… హర్యానాలో ఎన్డీయే మీటింగ్‌ పెట్టడం..! అదీ ముఖ్యమంత్రి ప్రమాణం అయిపోయిన వెంటనే జరగనుండటంపై పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయి. హర్యానా వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఎలాంటి సంకేతాలివ్వాలనుకుంటున్నారు…? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి చూడాలి మోదీ స్కెచ్‌ ఏంటో…!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..