Rajya Sabha Results: పెద్దల సభలో పెరిగిన ఎన్డీఏ బలం.. కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ వ్యవహారం

| Edited By: Balaraju Goud

Feb 28, 2024 | 10:26 AM

ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబడుతూ భారతీయ జనతా పార్టీ (BJP) దూసుకెళ్తోంది. అవి ప్రజలు నేరుగా పాల్గొనే ఎన్నికలైనా, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఎన్నికలైనా సరే.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు శతాబ్దానికి పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే జరిగింది.

Rajya Sabha Results: పెద్దల సభలో పెరిగిన ఎన్డీఏ బలం.. కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ వ్యవహారం
Parliament
Follow us on

ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబడుతూ భారతీయ జనతా పార్టీ (BJP) దూసుకెళ్తోంది. అవి ప్రజలు నేరుగా పాల్గొనే ఎన్నికలైనా, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఎన్నికలైనా సరే.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు శతాబ్దానికి పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే జరిగింది.

వివిధ రాష్ట్రాల్లో కమలం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ 28 సీట్లు గెలవాల్సి ఉండగా, ప్రత్యర్థి క్యాంపు నుంచి క్రాస్ ఓటింగ్ చేయించి మరో 2 సీట్లు అదనంగా గెలుచుకుంది. దీంతో 56 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 30 సీట్లు బీజేపీ గెలుచుకోగా, ఎన్డీఏ మిత్రపక్షాలు మరో 5 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ గెలిచిన 30 స్థానాల్లో వివిధ రాష్ట్రాల్లో 20 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకోగా యూపీ, హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 10 సీట్లను కైవసం చేసుకుంది. ఆ 30 సీట్లలో ఉత్తరప్రదేశ్ నుంచి 8, గుజరాత్ 4, మధ్యప్రదేశ్ 4, మహారాష్ట్ర 4, రాజస్థాన్ 2, బిహార్ 2, పశ్చిమ బెంగాల్ 1, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ 1, కర్ణాటక 1, ఒడిశా 1, సిక్కింలో 1 స్థానం ఉన్నాయి. ఈ ఎన్నికలతో రాజ్యసభలో ఆ పార్టీ సొంత బలం 97కు చేరుకుంది. మొత్తం 245 సీట్ల రాజ్యసభలో జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ లేనందున 4 సీట్లు ఖాళీగా ఉండగా, నామినేటెడ్ కేటగిరీలో 1 సీటు ఖాళీగా ఉంది.

మిగిలిన 240 స్థానాల రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 117కు చేరుకుంది. మరో 4 సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ 121కు చేరుకుంటుంది. సంఖ్యాబలం లేనప్పటికీ ఏ కూటమిలోనూ లేని తటస్థ రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), బిజూ జనతా దళ్(BJD) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు మద్దతిచ్చాయి. తాజా ఎన్నికలతో సభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఉన్న మొత్తం సీట్లలో ఆ పార్టీయే పాగా వేసి, 4 దశాబ్దాల చరిత్రలో తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా పెద్దల సభలో ప్రాతినిథ్యం లేకుండా చేసింది.

యూపీలో సైకిల్ పార్టీకి షాక్

జన సంఖ్య, చట్టసభల సభ్యుల సంఖ్య ప్రకారం దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP)కి కమలనాథులు షాక్ ఇచ్చారు. సభలో సంఖ్యాబలం ప్రకారం యూపీలో ఎన్నికలు జరిగిన 10 సీట్లలో బీజేపీ 7, సమాజ్‌వాదీ పార్టీ 3 సీట్లు గెలుపొందుతుందని అందరూ భావించారు. సాధారణంగా తమ సంఖ్యాబలాన్ని అనుసరించి పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించుతాయి. ప్రాధాన్యతాక్రమంలో జరిగే ఓటింగ్ విధానంలో కొన్ని ఓట్లతో అదనంగా ఒక సీటు గెలిచే అవకాశం ఉందంటే ఏ పార్టీ కూడా వదులుకోదు. చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులను లెక్కలోకి తీసుకుని ఈ ప్రయోగం చేస్తుంటాయి. యూపీలో కూడా ఇదే జరిగింది. బీజేపీ తరఫున ఆర్పీఎన్ సింగ్, సుధాన్షు త్రివేది, తేజ్‌వీర్ సింగ్, సంగీత బల్వంత్, సాధనా సింగ్, అమర్‌పాల్ మౌర్య, నవీన్ జైన్‌తో పాటు అదనంగా సంజయ్ సేథ్‌ను బరిలోకి దించింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు అభ్యర్థులు రామ్‌జీ లాల్ సుమన్, నటి జయా బచ్చన్, అలోక్ రంజన్‌ను బరిలోకి దించింది.

అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయకుండా ఆయా పార్టీల అధినేతలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోలింగ్ కంటే ఒక రోజు ముందు తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా.. 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఊహించినట్టే సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఫలితంగా ఆ పార్టీ తమ 3వ అభ్యర్థి అలోక్ రంజన్‌ను గెలిపించుకోలేకపోయింది. బీజేపీ 8వ అభ్యర్థి సంజయ్ సేథ్ గెలుపొందడంతో ఆ పార్టీ అదనంగా 1 స్థానం తన ఖాతాలో జమచేసుకుంది.

క్రాస్ ఓటింగ్‌తో సంక్షోభంలోకి హిమాచల్ సర్కార్

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకే ఒక స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభ వాతావరణాన్ని సృష్టించాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 40 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ కనీస సంఖ్య 35 కంటే మరో ఐదుగురు ఎక్కువే ఉన్నారు. బీజేపీ సంఖ్యాబలం 25 కాగా మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభిషేక్ మను సింఘ్వి సునాయాసంగా గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. సంఖ్యాబలం ప్రకారం తాము గెలుస్తామన్న విశ్వాసంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది.

కాంగ్రెస్ క్యాంపులో 6 గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థికి 34 మాత్రమే వచ్చాయి. అదే సమయంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన హర్ష్ మహాజన్‌కు బీజేపీ సొంతం 25, స్వతంత్రులు ముగ్గురుతో పాటు కాంగ్రెస్ నుంచి 6 గురు ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆయనకు కూడా 34 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చినందున ఎన్నికల అధికారులు టాస్ వేయడం ద్వారా అభ్యర్థి గెలుపును నిర్ణయించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని దురదృష్టం వెంటాడింది. టాస్‌లో సింఘ్వి ఓటమి పాలవగా, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు.

ఎన్నికలు, ఫలితాల్లోనే ఇంత హైడ్రామా చోటుచేసుకోగా.. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను హర్యానా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కిడ్నాప్ చేశాయని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆరోపించారు. సిమ్లా నుంచి హర్యానాలోని పంచకుల (చండీగఢ్‌కు ఆనుకున్న ప్రాంతం)కు తమ ఎమ్మెల్యేలను తరలించాలని చెప్పారు. అయితే రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సభలో 26 మంది ఎమ్మెల్యేలు సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజ్యసభ ఎన్నికల ద్వారా తలెత్తిన ఈ సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్‌కు పరిశీలకులను పంపించింది. పరిశీలకులుగా హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిమ్లాకు బయల్దేరారు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ పాస్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జైరా ఠాకూర్ మంగళవారం రాత్రే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. మొత్తంగా హిమాచల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠకు దారితీశాయి.

కర్ణాటకలో కమలానికి షాక్

కర్ణాటకలోని 4 స్థానాలకు కాంగ్రెస్ ముగ్గురిని, బీజేపీ ఒకరిని, బీజేపీ-జేడీఎస్ సంయుక్తంగా మరొకరిని బరిలోకి దించడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు స్వతంత్రులు, మరో రెండు చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలిసి మొత్తం అధికార కూటమి సంఖ్యాబలం 138గా ఉంది. బీజేపీకి సొంతంగా 66 మంది ఎమ్మెల్యేలుండగా, జేడీ(ఎస్) కు 19 మంది ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ పరిస్థితుల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) సంయుక్తంగా నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటే మరికొందరు అధికార కూటమి ఎమ్మెల్యేల ఓటు అవసరం పడింది.

అయితే అనూహ్యంగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్‌కు ఓటేయగా, మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అజయ్ మాకెన్, సయ్యద్ నాసీర్ హుస్సెన్, జీసీ చంద్రశేఖర్ వరుసగా 47, 46, 46 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నారాయణ రెడ్డి ఒక్కరే గెలుపొందారు. బీజేపీ-జేడీ(ఎస్) ఉమ్మడిగా బరిలోకి దించిన డి. కుపేంద్ర రెడ్డి ఓటమి పాలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…