Maharashtra Election-2024: సీఎం అభ్యర్థి ఆయనే.. ఎన్డీఏ కూటమి సంకేతం.. సందిగ్ధంతో ఇండి-కూటమి!

| Edited By: Balaraju Goud

Oct 17, 2024 | 9:38 AM

లోక్‌సభ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌లకు గట్టి పరీక్ష ఎదురు కానుంది. నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి, హర్యానాలో అనుసరించి వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేయబోతుందా?

Maharashtra Election-2024: సీఎం అభ్యర్థి ఆయనే.. ఎన్డీఏ కూటమి సంకేతం.. సందిగ్ధంతో ఇండి-కూటమి!
Maharashtra Election 2024
Follow us on

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే పడింది. వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలతో ఏర్పడ్డ కూటములు ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశం చుట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP), శివసేన (SS – ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ (NCP – అజిత్ పవార్ వర్గం) పార్టీలు కలిసి ‘మహాయుతి’ పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. ప్రతిపక్షంగా, ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ (INC), శివసేన (SS – ఉద్ధవ్ థాక్రే), నేషనలిస్ట్ కాంగ్రెస్ (NCP – శరద్ పవార్ వర్గం) పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ (MVA) పేరుతో కూటమిగా ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరోక్షంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యర్థి కూటమి ‘మహా వికాస్ అఘాడీ’ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చాల్సిన సంకట స్థితిలో ఇరుక్కుంది. ఇందుక్కారణం ఆ కూటమి పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే కీలకం

గతంలో తమకు నచ్చిన పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపిస్తే.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది గెలుపొందిన ఎమ్మెల్యేలు లేదా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించేది. కానీ గత 2 దశాబ్దాలుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రెసిడెన్షియల్ ఎన్నికల తరహాలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నదాన్ని బట్టే ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటున్నారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి తరఫున నరేంద్ర మోదీయే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు మరోసారి రాగా.. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి (I.N.D.I.A) కూటమి తేల్చీ తేల్చకుండా పరోక్షంగా రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. మోదీని మరోసారి ప్రధానిగా కోరుకున్నవారు భారతీయ జనతా పార్టీ (BJP) లేదా దాని మిత్రపక్షాలకు ఓటేయగా, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ప్రజలు కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలకు ఓటేశారు.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ప్రజలు తెలుగుదేశం (TDP), జనసేన (JSP), భారతీయ జనతా పార్టీ (BJP)లతో ఎన్డీఏ కూటమికి ఓటేయగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీకి ఓటేశారు. అలాగని అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందే ప్రకటిస్తున్నారా అంటే అదీ లేదు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల ముందు ప్రకటిస్తుండగా.. కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రులు ఎవరన్నది నిర్ణయిస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందనుకుంటే పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించి లాభం పొందాలని చూస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

‘మహాయుతి’లో మైత్రి

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు అధికార కూటమి మహాయుతికి 202 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో అత్యధికంగా 102 మంది బీజేపీకి చెందినవారే ఉన్నారు. లెక్కప్రకారం కూటమిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందిన పార్టీయే ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని చీల్చి బయటికొచ్చినందుకు ‘ఏక్‌నాథ్ షిండే’కు సీఎం పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ కూడా ఈ కూటమిలో చేరినప్పటికీ సీఎం పదవి విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు. నిజానికి మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వంటి నేతలకు ఇది మింగుడపడని వ్యవహారమే అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని సాఫీగా ముందుకు సాగించాలంటే ఈ త్యాగం చేయక తప్పలేదు. అంతర్గతంగా కొన్ని విబేధాలు, మనస్పర్థలు ఉన్నప్పటికీ ‘మహాయుతి’లో స్నేహబంధం బలంగానే కనిపిస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థి ఏక్‌నాథ్ షిండేయేనని కూటమి ప్రకటించగలిగింది.

‘మహా వికాస్ అఘాడీ’లో అయోమయం

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజాతీర్పు కూడా ఈ కూటమికి అనుకూలంగా ఇచ్చింది. అయితే బీజేపీ 106 సీట్లు గెలుపొందగా, శివసేన 56 సీట్లు మాత్రమే గెలిచింది. దాదాపు రెండింతల తేడా ఉన్నప్పటికీ సీఎం పదవి తనకే కావాలని ఉద్ధవ్ థాక్రే పట్టుబట్టడంతో రెండు పార్టీల మధ్య స్నేహం చెడింది. చివరకు ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్దవ్ థాక్రే మహావికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి సీఎం పదవిని దక్కించుకున్నారు. ఇక్కడి వరకు సాఫీగానే సాగింది. కానీ ఏక్‌నాథ్ షిండే శివసేనను చీల్చి బయటికి రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. అయినా సరే కూటమి కొనసాగింది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎక్కువ స్థానాలు (21) తీసుకుని పోటీ చేయగా, కేవలం 9 మాత్రమే గెలిచింది. శివసేన కంటే తక్కువ స్థానాల్లో (17)పోటీ చేసిన కాంగ్రెస్ ఏకంగా 13 సీట్లు గెలుచుకుంది. దీంతో కూటమిలో కాంగ్రెస్ పైచేయి సాధించి పెద్దన్న పాత్రకు ఎదిగింది.

ఇక, ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే కొనసాగాలని భావించినప్పటికీ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో మిత్రపక్షాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోతోంది. ఉద్ధవ్ థాక్రే మాత్రం తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. కాంగ్రెస్, మరో మిత్రపక్షం ఎన్సీపీ నుంచి ఈ విషయంలో ఎలాంటి సానుకూలత కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చులే అన్న ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీకే సీఎం పదవి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సెప్టెంబర్ నెలలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే కూటమిలో ఐక్యత దెబ్బతింటుందేమోన్న ఆందోళన కూడా ఆ పార్టీని వేధిస్తోంది.

కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా ఈ విషయంలో మౌనాన్నే ఆశ్రయించింది. తాము ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం లేదని అక్టోబర్ 13న శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అయితే విపక్ష కూటమి తమ సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుక్కారణం.. సీఎంగా ఉద్ధవ్ థాక్రే ఉన్న సమయంలో కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఆయనకు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని కూలదోశారన్న సానుభూతి కూడా ప్రజల్లో ఉంటుంది. అందుకే ఉద్ధవ్ థాక్రే పేరును ప్రకటించడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..