Delhi Airport: రూ.27 కోట్ల విలువైన వాచ్‌‌తో ఫ్లైట్ దిగిన ప్రయాణికుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన కస్టమ్స్.. వీడియో

|

Oct 06, 2022 | 8:16 PM

ఈ జాకబ్‌ అండ్‌ కో చేతి గడియారం తయారీకి 18 క్యారెట్ల గోల్డ్‌ కేస్‌ని వాడారు. దీనిపై మొత్తం 76 వైట్‌ డైమండ్లను పొదిగారు. దీనిలో ఉన్న స్కెలిటన్‌ డయల్‌లోనూ డైమండ్లు ఉన్నాయి.

Delhi Airport: రూ.27 కోట్ల విలువైన వాచ్‌‌తో ఫ్లైట్ దిగిన ప్రయాణికుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన కస్టమ్స్.. వీడియో
Delhi Airport
Follow us on

స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా.. లక్ష కాదు.. కోటి కాదు.. 27 కోట్ల విలువైన వాచ్‌‌తో పాటు మరిన్ని ఖరీదైన వస్తువులతో ఢిల్లీ చేరుకున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అత్యంత ఖ‌రీదైన వాచ్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌లను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ కేసు న‌మోదు చేసిన అధికారులు నిందితుడి నుంచి ఏడు అత్యంత ఖ‌రీదైన వాచ్‌ల‌ను, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను సీజ్ చేశారు. డైమండ్‌లు పొదిగిన గోల్డ్ బ్రాస్‌లెట్‌తో పాటు ఐఫోన్ 14 ప్రొ 256జీబీ స్మార్ట్‌ఫోన్ స‌హా ఇత‌ర వ‌స్తువులను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఖ‌రీదైన వాచ్‌ల్లో జాకబ్‌ అండ్‌ కో వాచ్ ధ‌ర అత్యంత అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గోల్డ్‌, డైమండ్‌ల‌తో పొదిగిన డిజైన‌ర్ పీస్‌గా రూపొందిన వాచ్‌ను సీజ్ చేశారు. దుబాయ్ నుంచి భార‌త్‌కు చేరుకున్న వ్యక్తిని.. టెర్మినల్ 3 వద్ద అదుపులోకి తీసుకొని పలు వ‌స్తువుల‌ను సీజ్ చేశారు. అడ్వాన్స్‌డ్ పాసింజ‌ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రొఫైలింగ్ ద్వారా నిందితుడిని ప‌సిగ‌ట్టారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా అత్యంత ఖ‌రీదైన ఏడు రిస్ట్ వాచ్‌లు ల‌భించాయి. జాకబ్‌ వాచ్‌ విలువ రూ.27 కోట్లు ఉండగా.. మిగిలిన వాటిలో ఐదు రోలెక్స్‌, ఒక పియాజెట్‌ వాచ్‌ ఉన్నాయి. మొత్తం ఏడు వాచ్‌ల విలువ 28.17 కోట్ల రూపాయలుగా లెక్కగట్టిన కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు.

ఈ జాకబ్‌ అండ్‌ కో చేతి గడియారం తయారీకి 18 క్యారెట్ల గోల్డ్‌ కేస్‌ని వాడారు. దీనిపై మొత్తం 76 వైట్‌ డైమండ్లను పొదిగారు. దీనిలో ఉన్న స్కెలిటన్‌ డయల్‌లోనూ డైమండ్లు ఉన్నాయి. స్విజ్జర్లాండ్‌లో తయారైన ఈ వాచ్‌.. దుబాయ్‌ ద్వారా.. ఢిల్లీకి చేరింది. ఎయిర్‌ పోర్టులో పట్టుబడిన స్మగ్లర్‌ ఈ ఏడు వాచ్‌లను గుజరాత్‌కు చెందిన ఓ వీవీఐపీ క్లయింట్‌కి చేరవేసేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నా.. క్లయింట్‌ రాకపోవడంతో మీటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో డైమండ్‌ వాచ్‌లతో పట్టుబడ్డాడు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. ఈ ఖరీదైన వాచ్‌లను ఎవరికి అమ్ముతున్నాడనేది పేర్లు బయటపెట్టబోనన్నాడు ఆ స్మగ్లర్‌. ఆ పేరు బయటికొస్తే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల అప్రమత్తతో ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని ఢిల్లీ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ మండలం సుర్జిత్ భుజబల్ తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టడంలో కస్టమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..