కాశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని వాటర్‌హాల్ ప్రాంతంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన భద్రతా దళాలకు చెందిన బస్సు కాలువలో పడింది. ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. చాలా మంది జవాన్లు గాయపడ్డారు. 36 మంది బీఎస్ఎఫ్ జవాన్లతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి అదుపుతప్పి కాలువలో జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వాటర్‌హాల్ జిల్లా సమీపంలోని బ్రెయిల్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు BSF జవాన్లు మరణించినట్లు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఖాన్‌సాహిబ్, బుద్గాం ఆస్పత్రుల్లో చేర్పించారు. రెండో దశ ఎన్నికల కోసం దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా నుంచి బుద్గామ్‌కు బస్సు వస్తుండగా ప్రమాదం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని 26 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతగా సెప్టెంబర్ 25న పోలింగ్ జరగనుంది. బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది బీఎస్ఎఫ్ జవాన్లలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గతంలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరిలో ఆర్మీ సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. బుధవారం (సెప్టెంబర్ 18), మంజాకోట్ ప్రాంతంలో వాహనాన్ని నడుపుతున్న ఒక సైనికుడు బ్లైండ్ టర్న్ వద్ద బ్యాలెన్స్ కోల్పోయాడు. దాని కారణంగా వాహనం 400 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పారా-2 యూనిట్ సిబ్బంది ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో ఆరుగురు కమెండోలు గాయపడగా, ఒక లాన్స్ నాయక్ వీరమరణం పొందాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..