INDIA Alliance: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధి రేసులో ‘ఆ నలుగురు’.. మోదీకి పోటీనిచ్చేనా.? సమస్యల నుంచి గట్టెక్కేనా.!

| Edited By: Ravi Kiran

Sep 30, 2023 | 10:26 AM

New Delhi, September 30: దేశంలో ఇప్పుడు ఎన్నికల కాలం నడుస్తోంది. దశాబ్ధ కాలంగా తిరుగులేని శక్తిగా నిలుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తదుపరి ఎన్నికల్లో ఢీకొట్టేందుకు దేశంలోని దాదాపు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇండియా కూటమి పేరుతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో కలిపి 28 పార్టీలు జతకట్టాయి. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి నరేంద్ర మోదీని గద్దె దించే లక్ష్యంగా..

INDIA Alliance: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధి రేసులో ఆ నలుగురు.. మోదీకి పోటీనిచ్చేనా.? సమస్యల నుంచి గట్టెక్కేనా.!
INDIA Alliance
Follow us on

New Delhi, September 30: దేశంలో ఇప్పుడు ఎన్నికల కాలం నడుస్తోంది. దశాబ్ధ కాలంగా తిరుగులేని శక్తిగా నిలుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తదుపరి ఎన్నికల్లో ఢీకొట్టేందుకు దేశంలోని దాదాపు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇండియా కూటమి పేరుతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో కలిపి 28 పార్టీలు జతకట్టాయి. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి నరేంద్ర మోదీని గద్దె దించే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఇండియా కూటమి. ఇప్పటికే మూడు కీలక భేటీలు నిర్వహించిన కూటమి.. అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారమే లక్ష్యంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. వివిధ కమిటీలను నియమించింది. ఎన్నికల కదనరంగంలో దూసుకెళ్తుంది. పాట్నా, బెంగళూరు, ముంబైలలో జరిగిన సమావేశాలన్నింటిలోనూ బీజేపీ గద్ది దించి.. తాము అధికారం చేపట్టే అంశంపైనే ప్రధానంగా చర్చించారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి నరేంద్ర మోదీ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మూడు మీటింగ్స్ జరిగినా.. తమ ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇండియా కూటమి ప్రకటించలేకపోతోంది. దీనికి కారణం.. ఈ పార్టీల్లోని నేతలంతా కీలక నేతలే కావడం. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, జేడీయూ నుంచి నితిష్ కుమార్, ఆప్ నుంచి కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, డీఎంకే నుంచి స్టాలిన్ పేర్లు ప్రధాని అభ్యర్థిత్వాలకు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ కూటమి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతుంది.

ఏదేమైనా 2024లో గెలవడం కోసం ఇండియా కూటమిలోని పెద్ద నాయకులు సమిష్టి నాయకత్వం కోసం కృషి చేస్తుంటే.. అదే పార్టీల్‌లోని రెండవ శ్రేణి నాయకులు తమ నాయకులకు హైప్ క్రియేట్ చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండియా కూటమిలోని భాగస్వామి అయిన ఆర్జేడీ, జేడీయూ నేతలు ఇప్పుడిదే ప్రధానంశంగా కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఈ పార్టీలకు చెందిన కొందరు నాయకులు నితిష్ కుమార్ ప్రధాని కావాలని తమ ఆకాంక్షలను బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈసారి ప్రధాన మంత్రి బీహార్‌కు చెందిన వ్యక్తి కావాలని, నితిష్ కుమార్ ఆ పదవికి సరైన వ్యక్తి అంటూ ఆర్జేడీకి చెందిన నేతలు చెబుతున్న మాట.

ఈ ప్రకటన వెలువడటమే ఆలస్యం అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కీలక అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఏ వ్యక్తి గుర్తించి ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు ఆప్ నేతలు. ప్రధాన మంత్రి అంటే దేశంలోని 140 కోట్ల మందికి ప్రతినిథి అని, ఈ 140 కోట్ల మంది కూడా ప్రధానులు కాలేరని వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో పరోక్షంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు ప్రకటించారు ఆ పార్టీ నేతలు.

ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై ప్రకటనల రేసులో నితిష్ నిలవడంపై, ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సెటైర్లు వేశారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ ప్రధాని పదవిపైనే ఉంటాయంటూ విమర్శించారు. ఇక బీజేపీ కూడా తామేం తక్కువా అంటూ నితిష్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. ముస్లిం ఓట్లను లాగేందుకు ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఆదిలోనే అంతర్యుద్ధం..

ప్రధాని రేసు ముచ్చట పక్కన పెడితే.. ఇండియా కూటమి వ్యవహారం ఆదిలోనే అగమ్యగోచరంగా మారింది. నరేంద్ర మోదీకి ఎదురెళ్లడం సంగతేమో గానీ.. వారిలో వారినే ఎదుర్కోలోని పరిస్థితి ఉండొచ్చనే పొలిటికల్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. కీలకమైన ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయం తీసుకోలేకపోవడం కీలక మైనస్ అయితే.. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయకపోవడం మరో మైనస్‌గా చెప్పొచ్చు. ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాల్లో సీట్ల పంపకాలు ఒకటి. ఈ పంపకాల ఫార్ములపై ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కూటమి నేతలు. ఇక ఉమ్మడి ర్యాలనీ నిర్వహించాలని, ఈ ర్యాలీని మధ్యప్రదేశ్‌లో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ, అది కూడా క్యాన్సిల్ అయ్యింది. కుల గణన విషయంలో ఇండియా కూటమిలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.

ఇక పార్టీల మధ్య వైరం సరే సరి. ఇండియా కూటమిలో పార్టీలన్నీ బయటకు ఐక్యతను ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం అదే వైరాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ – తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ – డీఎంకే పేర్లను ప్రధానంగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎందుకంటే.. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆప్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం, పంజాబ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రకటనలు చేయడం, ఢిల్లీ విషయంలోనూ అదే విధమైన ప్రకటన చేయడం ఆ పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది..

పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. మమతా బెనర్జీపై నిత్యం విరమ్శలు గుప్పిస్తున్నారు. మమత చేపట్టిన స్పెయిన్ టూర్ వ్యర్థమని విమర్శించారు. ఇక డెంగ్యూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. సంకీర్ణ ధర్మాన్ని పాటించాలంటూ అధిర్ రంజన్‌కు సూచించింది. అంతకు ముందు.. కుల గణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను టీఎంసీ వ్యతిరేకించింది. ఇలా కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి.

సనాతన ధర్మ విషయంలో డీఎంకే వర్సెస్ కాంగ్రెస్..

సనాతన ధర్మంపై వ్యాఖ్యల విషయంలో డీఎంకే వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్‌ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. దాంతో కాంగ్రెస్ తీరుపై డీఎంకే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. చాలా రాష్ట్రాల్లో బీజేపీతో పోరాడుతున్నట్లుగానే.. ప్రాంతీయ పార్టీలతోనూ పోరాడుతోంది. ఎక్కడైతే పోరాటం సాగిస్తుందో.. ఆ పార్టీలతోనే ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత సంకటంగా మారింది. ఉదాహరణకు చూసుకుంటే..

1. ఇంతకు ముందు యూపీలో సమాజ్ వాది పార్టీతో కాంగ్రెస్ పోరాడింది. ఇప్పుడు ఇదే పార్టీలో పొత్తు కుదుర్చుకుంది.

2. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడింది. ఇప్పుడు ఇదే పార్టీలో పొత్తు కుదుర్చుకుంది.

3. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పుడు అదే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది.

4. ఢిల్లీలోనూ సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై పోటీ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపింది.

5. గుజరాత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంత ఫైట్ చేస్తుందో.. అంతేస్థాయిలో ఆప్ కూడా ఫైట్ చేస్తోంది.

6. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా పరిణమించింది.

7. గోవాలో కూడా ఆప్‌కి, కాంగ్రెస్‌కి మధ్య గట్టి పోటీ ఉంది.

మొత్తంగా చూసుకుంటే.. ఇండియా కూటమి అనేక సమస్యలు, అభిప్రాయ బేదాలలతో సతమతం అవుతోంది. ఈ అంతర్గత సమస్యలన్నింటినీ అధిగమించాలంటే.. ఈ కూటమి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడుగానీ.. నరేంద్ర మోదీని బీట్ చేయడం ఇండియా కూటమికి సాధ్యం కాదు.

బీజేపీ పరిస్థితి కూడా అంతే..

ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్డీయే కూటమి నుంచి ఒక్కో పార్టీ విడిపోతున్నాయి. తాజాగా బీజేపీ నుంచి ఏఐఏడీఎంకే పార్టీ విడిపోయింది. ఎన్డీయేకి రామ్ రామ్ చెప్పేసింది. ఆ పార్టీ నేతల కామెంట్స్, అనుసరిస్తున్న విధానాలను తమకు ఆమోదయోగ్యంగా లేదంటూ, ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇక శిరోమణి అకాలీదల్, శివసేన వంటి పార్టీలు కూడా ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..