AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా సరిహద్దు వద్ద భారత వైమానిక దళం కదనోత్సాహం.. భారీ యుద్ధ విన్యాసాలతో శత్రువులకు సవాల్!

చైనా సరిహద్దు సమీపంలో భారత వైమానిక దళం (IAF) తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో నవంబర్ 13 నుంచి 21 వరకు వారం రోజుల పాటు భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది. ఈ మేరకు సంబంధిత ప్రాంతంలోని గగనతలానికి సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

చైనా సరిహద్దు వద్ద భారత వైమానిక దళం కదనోత్సాహం.. భారీ యుద్ధ విన్యాసాలతో శత్రువులకు సవాల్!
Military Drills
Balaraju Goud
|

Updated on: Nov 11, 2026 | 11:26 AM

Share

చైనా సరిహద్దు సమీపంలో భారత వైమానిక దళం (IAF) తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో నవంబర్ 13 నుంచి 21 వరకు వారం రోజుల పాటు భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది. ఈ మేరకు సంబంధిత ప్రాంతంలోని గగనతలానికి సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం హిమాలయాల వంటి అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో భారత వైమానిక దళం పోరాట సామర్థ్యాన్ని, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వేగాన్ని పరీక్షించడం. ముఖ్యంగా చైనా సరిహద్దుకు సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు.

ఈ సందర్భంగా ఫ్రంట్‌లైన్ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే బియాండ్ విజువల్ రేంజ్ (BVR) సామర్థ్యాలు, యుద్ధ విమానాల వేగం, అధిక ఎత్తులో ఇంజిన్ల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. శత్రు విమానాలు లేదా ఇతర ముప్పులను గుర్తించి సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపైనా దృష్టి సారించనున్నారు.

మరోవైపు, ఈ విన్యాసాల్లో అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ (ALG) వినియోగం కూడా కీలకంగా ఉండనుంది. పర్వత ప్రాంతాల్లోని చిన్న రన్‌వేలపై విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సైనిక బలగాలను వేగంగా తరలించడం, అవసరమైన ఆయుధాలు, ఇతర సామగ్రిని చేరవేయడం వంటి అంశాలను పరీక్షించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని మధ్య హిమాలయ ప్రాంతంలో సైనిక మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఏర్పడింది.

విమాన ప్రయాణికులకు అలర్ట్..

ఈ సైనిక విన్యాసాల కారణంగా కొన్ని పౌర విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో విమానయాన సంస్థలు ముందుగానే వైమానిక దళంతో సమన్వయం చేసుకుని విమాన మార్గాలు, షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

NOTAM అంటే ఏమిటి?

NOTAM అంటే Notice to Airmen. సైనిక విన్యాసాలు, క్షిపణి పరీక్షలు లేదా ఇతర భద్రతాపరమైన కార్యకలాపాల కారణంగా నిర్దిష్ట ప్రాంతంలోని గగనతలంపై పరిమితులు విధించినప్పుడు విమాన పైలట్లు, విమానయాన సంస్థలకు ముందస్తుగా సమాచారం ఇచ్చే అధికారిక వైమానిక నోటీసు. విమానాల భద్రతను నిర్ధారించడం, ప్రమాదాలను నివారించడం దీని ప్రధాన ఉద్దేశం. మొత్తంగా ఈ విన్యాసాలు భారత వైమానిక దళం యుద్ధ సంసిద్ధతను, సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us