న్యూఢిల్లీ, జనవరి 12: బిగ్ డేటా, డేటా సైన్స్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ (UN-CEBDకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీలో భారత్ తాజాగా సభ్యత్వం పొందింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పర్యవేక్షణ, రిపోర్టింగ్ సామర్థ్యంతో సహా బిగ్ డేటా ప్రయోజనాలు, సవాళ్లను మరింత సమర్ధవంతంగా పరిశోధించడానికి అవసరమైన అధికారిక గణాంకాల అన్వేషణ కోసం ఇందులో సభ్యత్వం పొందింది. ఐక్యరాజ్య సమితి స్టాటిస్టిక్స్ కౌన్సిల్‌లో భారత్ సభ్యత్వం పొందడం ఓ మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ (MoSPI) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీలో భారత్‌ను చేర్చుకోవడం దేశ గణాంక పర్యావరణ వ్యవస్థకు గణనీయమైన పురోగతిని సూచిస్తుందని తన ప్రకటనలో పేర్కొంది.
అధికారిక గణాంకాల కోసం బిగ్ డేటా, డేటా సైన్స్‌ను వినియోగించుకోవడం ద్వారా ప్రపంచ ప్రమాణాలు, అభ్యాసాలను రూపొందించడానికి దోహదం చేస్తుందని MoSPI వెల్లడించింది. దీనిలో భాగంగా డేటా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం, శాటిలైట్ ఇమేజరీ, మెషిన్ లెర్నింగ్‌తో సహా ప్రత్యామ్నాయ డేటా వనరుల అన్వేషణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. డేటా ఇన్నోవేషన్ ల్యాబ్ నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ (NSS)ని బలోపేతం చేయడానికి ఇన్నోవేషన్ కోసం పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ గ్లోబల్ ఫోరమ్‌లో భారత్ ఓ ప్రధాన ఆటగాడిగా నిలబెట్టింది. ఈ కమిటీలో సభ్యత్వం భారతదేశం బిగ్ డేటా, డేటా సైన్స్‌లో దేశీయ పురోగతిని అంతర్జాతీయ లక్ష్యాలతో సమలేఖనం చేయడానికి వ్యూహాత్మక అవకాశం లభించినట్లైందని మంత్రిత్వ శాఖ తెల్పింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, శాటిలైట్ ఇమేజరీ, ప్రైవేట్ సెక్టార్ డేటా స్ట్రీమ్‌ల వంటి సాంప్రదాయేతర డేటా సోర్స్‌లను ఏకీకృతం చేయడం ద్వారా, భారత్ తన గణాంక ప్రక్రియలను ఆధునీకరించడం, అంచనాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, విధాన రూపకల్పన, పాలన కోసం క్లిష్టమైన డేటాను సకాలంలో యాక్సెస్ చేయడం వంటి కీలక విషయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన ప్రకటనలో MoSPI మంత్రిత్వ శాఖ పేర్కొంది.