ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వాతావరణంలో భారీ మార్పులు.. దక్షిణాదికి కీలక హెచ్చరిక!

భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ భారతదేశ వాతావరణంపై కీలక అంచనాలను వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15-21 మధ్య ప్రవేశించి, సాధారణ వర్షాలను కురిపిస్తాయని తెలిపింది. ప్రస్తుతం బలమైన ఎల్‌నినో నవంబర్ వరకు కొనసాగి, 2027 మార్చి వరకు ప్రభావం చూపవచ్చని పేర్కొంది. వాతావరణ అంచనాల్లో కచ్చితత్వం పెరిగిందని, విపత్తు నిర్వహణకు ఇది ఉపకరిస్తుందని IMD వెల్లడించింది.

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వాతావరణంలో భారీ మార్పులు.. దక్షిణాదికి కీలక హెచ్చరిక!
El Nino Impact South India
Image Credit source: AI Image

Updated on: Oct 02, 2026 | 10:55 AM

దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అంచనాలను వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 నుంచి 21 మధ్య దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

చెన్నైలోని పల్లికరణైలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT)లో ఈశాన్య రుతుపవనాలపై వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర, తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.

దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు!

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మొత్తంగా సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మహాపాత్ర తెలిపారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. అక్టోబర్‌లో దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కేరళ కొండ ప్రాంతాల్లో సాధారణం లేదా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అదే సమయంలో దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

మార్చి 2027 వరకు ఎల్‌నినో ప్రభావం?

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బలంగా ఉందని IMD చీఫ్ పేర్కొన్నారు. నవంబర్ చివరి వరకు దీని ప్రభావం బలంగా కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే దాని ప్రభావాలు 2027 మార్చి వరకు కొనసాగవచ్చని వివరించారు. ప్రస్తుతం ఎల్‌నినో తటస్థ స్థితికి దగ్గరగా ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో పాజిటివ్ దశకు మారే అవకాశం ఉందని అంచనా వేశారు. తుపానుల విషయంలోనూ దక్షిణ ప్రాంతాలకు సంబంధించి IMD కీలక సూచనలు చేసింది. తుపానులు దక్షిణ దిశగా ఏర్పడే అవకాశాల నేపథ్యంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలపై వాటి ప్రభావం తక్కువగా ఉండవచ్చని మహాపాత్ర తెలిపారు.

వాతావరణ అంచనాల్లో మరింత కచ్చితత్వం

గత కొన్నేళ్లలో వాతావరణ అంచనాల సామర్థ్యం మెరుగుపడిందని IMD తెలిపింది. 2016-2020 మధ్య అంచనాల్లో నమోదైన లోపం 7.9 శాతంగా ఉండగా, 2021-2025 కాలంలో అది 2.2 శాతానికి తగ్గినట్లు మహాపాత్ర వివరించారు. గ్రామ స్థాయి వరకు వాతావరణ సమాచారాన్ని అందించే సామర్థ్యం పెరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, సమన్వయంతో కూడిన చర్యల ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ చంద్రమోహన్ అన్నారు.

తమిళనాడు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏజెన్సీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,400 ఆటోమేటిక్ రైన్ గేజ్‌లు, 100కు పైగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ఏడాది మరో 1,000 వర్షమాపక యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి గ్రామ పంచాయతీలోనూ వర్షమాపక యంత్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉందన్నారు. ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కొనేందుకు జిల్లాల స్థాయిలో ముందస్తు ప్రణాళికలు, సమీక్షలు కొనసాగుతున్నాయని చంద్రమోహన్ తెలిపారు. వాతావరణ అంచనాలను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా సహాయక, పునరావాస చర్యలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us