Delhi Liquor Scam: అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్.. గోవా ఎన్నికల వేళ..

| Edited By: Shaik Madar Saheb

Apr 16, 2024 | 6:27 PM

Delhi's Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కేసు ఇక కొలిక్కి వచ్చిందనే అందరూ భావించారు. ఇక తుది చార్జిషీటు దాఖలు చేయడం ఒక్కటే మిగిలిందని, త్వరలో ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కథ కంచికి చేరలేదని, అసలు కథ ఇంకా మిగిలే ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) అంటోంది.

Delhi Liquor Scam: అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్.. గోవా ఎన్నికల వేళ..
Delhi Liquor Policy Case
Follow us on

Delhi’s Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కేసు ఇక కొలిక్కి వచ్చిందనే అందరూ భావించారు. ఇక తుది చార్జిషీటు దాఖలు చేయడం ఒక్కటే మిగిలిందని, త్వరలో ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కథ కంచికి చేరలేదని, అసలు కథ ఇంకా మిగిలే ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) అంటోంది. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు హవాలా మార్గాల్లో తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), వాటిలో దాదాపు రూ. 45 కోట్లు గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖర్చు చేసిందని ఈడీ చెబుతోంది. డబ్బును సమకూర్చి అందజేసిన మద్యం వ్యాపారులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్‌చంద్ర రెడ్డి సహా మరికొందరి వాంగ్మూలాలను ఇందుకు ఆధారంగా ఈడీ పేర్కొంటోంది. ఏ కేసులోనైనా నేరానికి ఉపయోగించిన సొమ్ము (సొత్తు)ను దర్యాప్తు సంస్థ రికవరీ చేసినప్పుడే నేరాన్ని రుజువు చేయడం సాధ్యపడుతుంది. సాధారణంగా నేరానికి ఉపయోగించిన సొమ్ముతో ఆస్తులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడమో లేదంటే వేరే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడమో చేస్తుంటారు. ఈడీ దర్యాప్తులో అలాంటి ఆస్తులను గుర్తించి జప్తు చేస్తూ ఉంటుంది. దీన్నే ఓవరాల్‌గా ‘మనీ ట్రయల్’ అంటుంటారు. నేరానికి ఉపయోగించిన సొమ్ము ఎక్కడ మొదలై, ఎన్ని చేతులు మారి, చివరకు ఎవరికి చేరిందనేది తేల్చే వ్యవహారమే మనీ ట్రయల్. ఢిల్లీ మద్యం కేసులో అది జరగలేదు అన్నది అటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇటు భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు సుమారు 130 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ.. అవి ఈ కేసుతో ముడిపడ్డ సొమ్ముతోనే కొన్నారా లేదా అన్నది ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. అయితే కేసులో ఇరుక్కున్న పార్టీల నేతలు ఆరోపిస్తున్నట్టు ‘మనీ ట్రయల్’ నిరూపించలేకపోతే.. ఈడీ ప్రయాస అంతా వృధానే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అభియోగాల ప్రకారం.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్‌చంద్ర రెడ్డి, కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూప్ రూ. 100 కోట్లు సమీకరించి హవాలా మార్గాల్లో ఆ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చింది. ఆ లెక్కన హైదరాబాద్ – ఢిల్లీ, చెన్నై – ఢిల్లీ, ఢిల్లీ – గోవా మధ్య హవాలా లావాదేవీలు జరిగాయి. సొమ్ము సమకూర్చిన వ్యక్తులు, వాటిని ఢిల్లీలో చేరవేసిన వ్యక్తిగత సిబ్బంది వాంగ్మూలాలతో మనీ ట్రయల్ చాలా వరకు ముందుకెళ్లింది. కానీ తీరా గోవాకు వెళ్లిన తర్వాత.. ఇతర నేరాల్లోని నిందితుల మాదిరిగా అది ఆస్తుల రూపంలోకో, ఖరీదైన వస్తువుల రూపంలోకో మారలేదు. ఆ సొమ్మును ఎన్నికల కోసం వినియోగించిన నేపథ్యంలో.. చిల్లరగా మారి ఓటర్లకు చేరిందా లేక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎవరికి చేరింది అన్నదే కేసులో కీలకంగా మారింది. దీన్ని నిరూపించడమే ఇప్పుడు ఈడీ ముందున్న అసలైన సవాల్. ఆ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత చోటుచేసుకున్న మరో అరెస్టు అత్యంత కీలకంగా మారింది. ఆ వ్యక్తే చన్‌ప్రీత్ సింగ్.

ఎవరీ చన్‌ప్రీత్ సింగ్?

గోవాకు హవాలా మార్గాల్లో తరలించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తే చన్‌ప్రీత్ సింగ్. గత ఏడాది మే నెలలోనే సీబీఐ ఇతణ్ణి అరెస్టు చేసింది. అయితే తాజాగా ఏప్రిల్ 12న ఈడీ అరెస్టు చేసి మర్నాడు కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఈనెల 18 వరకు చన్‌ప్రీత్ సింగ్‌ను ఈడీ కస్టడీకి అప్పగించడంతో.. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) ప్రకారం ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో చోటుచేసుకున్న మనీలాండరింగ్ అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. చన్‌ప్రీత్ సింగ్ అరెస్టుతో ఈడీ కేసులో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అనంతరం కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఈడీ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గోవా ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించి విచారణ జరిపింది. వారిలో కొందరిని కేజ్రీవాల్‌కు ఎదురుగా కూర్చోబెట్టి కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించింది. ఆ విచారణ నుంచి రాబట్టిన సమాచారం మేరకే ఈ మొత్తం వ్యవహారంలో చన్‌ప్రీత్ సింగ్ ఆప్ తరఫున కీలక పాత్ర పోషించారని నిర్థారించుకుంది. అందుకే అరెస్టు చేసి ప్రస్తుతం ప్రశ్నిస్తోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కోసం ఖర్చు చేసిన హవాలా డబ్బు గురించి ఆరా తీస్తోంది. ఎంతమొత్తంలో ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. చన్‌ప్రీత్ సింగ్ 2021 ఆగస్టు నుంచి జనవరి 2022 వరకు 18 సందర్భల్లో రూ. 17.38 కోట్ల సొమ్మును హవాలా కొరియర్ల నుంచి సేకరించినట్లు ఈడీ గుర్తించింది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ కోసం ప్రచారం చేసిన కార్యకర్తలు, ఏరియా మేనేజర్లు, సర్వే వర్కర్లు, అసెంబ్లీ మేనేజర్లతో పాటు మరికొందరికి ఈ డబ్బును చన్‌ప్రీత్ సింగ్ అందజేసినట్టు భావిస్తోంది. మొత్తంగా ఈ డబ్బును వివిధ రూపాల్లో జరిగే ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసినట్టు గుర్తించింది. చన్‌ప్రీత్ సింగ్ పార్టీలో నేతగా కాకుండా పార్టీ కోసం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు ఈడీ గుర్తించింది.

ఈ మేరకు ఆప్ ఢిల్లీ కార్యాలయం నుంచి నెలకు రూ. 55 వేల జీతం చన్‌ప్రీత్ సింగ్ అందుకున్నట్టు ఆధారాలు సేకరించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు, కేజ్రీవాల్ ముఖంలా వ్యవహరించిన విజయ్ నాయర్ కి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘ఓన్లీ మచ్ లౌడర్’ నుంచి చన్‌‌ప్రీత్ సింగ్ నిధులు పొందారని కూడా ఈడీ గుర్తించింది. లిక్కర్ పాలసీ కేసు నిందితులు విజయ్ నాయర్, రాజేష్ జోషితో చన్‌ప్రీత్ సింగ్‌కు ఉన్న సంబంధాల గురించి కూడా ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హవాలా మార్గాల్లో గోవాకు డబ్బును చేర్చి, సింగ్‌కు అందజేసినవారిలో సినీ నిర్మాణ సంస్థకు చెందినవారున్నారు. అంగాడియా సినిమా యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో హవాలా సొమ్మును సింగ్‌తో పాటు మరికొందరికి చేర్చినట్టు ఈడీ విచారణలో అంగీకరించాడు. సింగ్ అప్పుడు చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోసం పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. గోవా ఎన్నికల ప్రచారం కోసం చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ డైరక్టర్‌గా ఉన్న రాజేష్ జోషిని ఇప్పటికే అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకుంది. ఇప్పుడు చన్‌ప్రీత్ సింగ్ అరెస్టుతో కేసు కీలక దశకు చేరుకుంది. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి, అక్కణ్ణుంచి గోవా ఎన్నికల ప్రచారం కోసం అక్రమ సొమ్ము ఎలా చేతులు మారింది అనే విషయాన్ని నిరూపించే క్రమంలో ఈడీ పురోగతి సాధించినట్టయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..