
సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్ అయ్యారు. విమానం లోపలే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో ఇవాళ సీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అభిజిత్ అరెస్ట్ అయ్యారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చింది. అయితే అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ఢిల్లీలో ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో భారీగా బలగాల మోహరించగా.. రాజధానిని అష్టదిగ్భంధనం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర 7 అంచెల భారీ బారికేడ్లు ఏర్పాటు చేయగా.. సున్నిత ప్రాంతాల్లో 300 పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసుల పకడ్బందీ ప్రణాళికలు వేశారు. సాధారణ దుస్తుల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించారు.
ఇవాళ్టి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు మూసివేశారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే 250 పైగా రైళ్లు రద్దు చేశారు. జన్పథ్-కర్తవ్య మార్గ్ చుట్టూ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. సెంట్రల్ ఢిల్లీకి 4 కి.మీ. పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా.. హోటళ్లు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అలాగే CJP ఆందోళనలతో నిన్న, ఇవాళ మద్యం దుకాణాలు ఢిల్లీలో పూర్తిగా బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిరసనలో పాల్గొనవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేయగా.. మహిళా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పింక్ ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో కేసులు ఎదుర్కొన్న వారిని ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు.
CJP ఆందోళనలకు అనుమతి లేదంటున్న పోలీసులు.. ఇందుకు కొన్ని కారణాలు చెప్తున్నారు. గత నిరసనల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేదని చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన, ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని అనుమతి నిరాకరించినట్టు ప్రకటించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా అనుమతివ్వలేమన్నారు. జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలకు 10 రోజుల ముందు అనుమతి తీసుకోవాలని, కేవలం 3 రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నారని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు.
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
“…I have come here to be arrested; arrest me,” Abhijeet Dipke tells Delhi Police
“No, this is not an arrest. Please cooperate,” Delhi Police personnel tell him.
— ANI (@ANI) October 10, 2026