Budget 2024: ఎన్నో ఆశలు.. ఐటీ మినహాయింపులపై ఎదురుచూపులు.. కేంద్ర బడ్జెట్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..!

|

Jul 21, 2024 | 9:40 AM

కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది ? ఉద్యోగులకు ఐటీ మినహాయింపులు ఉంటాయా ? సంస్కరణలు కొనసాగుతాయా ? లేక మిత్రపక్షాల ఒత్తిళ్లకు మోదీ తలొగ్గుతారా ? ఈనెల 23వ తేదీన అన్ని విషయాలను తేల్చబోతున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.

Budget 2024: ఎన్నో ఆశలు.. ఐటీ మినహాయింపులపై ఎదురుచూపులు.. కేంద్ర బడ్జెట్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..!
Budget 2024
Follow us on

కేంద్ర బడ్జెట్‌ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా ? లేక సంక్షేమానికి జై కొడుతుందా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అంటేనే సంస్కరణలకు మారుపేరని వాదన ఉంది. ప్రధాని మోదీ పదేళ్ల హయాంలో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా జీఎస్టీ లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వన్‌ నేషన్‌ .. వన్‌ ట్యాక్స్‌ అన్ని సిద్దాంతాన్ని అమలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కూడా చాలా ముందుకెళ్లారు.. కాని ఇప్పుడు కూడా అదే దూకుడు కొనసాగిస్తారా ? వేచిచూడాలి.. బీజేపీ పదేళ్ల తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడింది. మిత్రపక్షాల అజెండాకు అనుగుణంగా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందా? ఈ ప్రశ్నకు బడ్జెట్‌ లోనే సమాధానం లభించే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు లాంటి సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు అంత ఈజీ కాదు. కేంద్ర బడ్జెట్‌ ఆదాయమార్గాలు పెంచే చట్టాలకు అనుకూలంగా ఉంటుందా? దీనికి కూడా బడ్జెట్‌ లోనే సమాధానం లభించే అవకాశం ఉంది.

ఏ రంగానికి కేంద్రం ప్రాధ్యాన్యత ఇస్తుందన్న విషయంపై సస్పెన్స్‌

కేంద్ర బడ్జెట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. దేశ పౌరులంతా ఈ బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఏ రంగానికి కేంద్రం ప్రాధ్యాన్యత ఇస్తుందన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాని చాలామంది బడ్జెట్‌లో పన్నులు తగ్గాలని కోరుకుంటున్నారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మెజారిటీ శాతం అంటే 56 శాతం ప్రజలు ఆదాయపు పన్ను మినహాయింపులను ఆశిస్తునట్టు ఓ సర్వేలో తేలింది. ఇప్పటికే భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సైతం ఇదే అంశాన్ని మోదీ సర్కారు దృష్టికి తీసుకెళ్లాయి. మార్కెట్‌లో వినీమయ సామర్థ్యం, కొనుగోలు శక్తి పెరగడానికి పన్ను కోతలు దోహదం చేస్తాయని, జనాల చేతుల్లో మరింత నగదు ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని కోరాయి.

ఉపాధికల్పనపై బడ్జెట్‌లో ఎక్కువ ఫోకస్‌

దేశంలో నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయింది. కేంద్రం ఉపాధికల్పనపై బడ్జెట్‌లో ఎక్కువ ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై విపక్షాలు కేంద్రాన్ని పదేపదే టార్గెట్‌ చేస్తున్నాయి. బీజేపీకి లోక్‌సభ సీట్లు తగ్గడానికి నిరుద్యోగం కూడా ప్రధాన కారణమన్న వాదనలు విన్పించాయి. పన్ను మినహాయింపులపై ఇప్పటివరకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్యాక్స్‌పేయర్లు తమకు ఏది లాభమో తెలుసుకుని కొత్త, పాత పన్ను విధానాలను ఎంచుకోవాలంటూ సూచించారు.

బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాలను హేతుబద్ధం చేయాలని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోరింది. ఉక్కు, సోలార్‌ బ్యాటరీ, అల్యూమినియం, లిథియం సెల్స్‌ తయారీ ఈ నిర్ణయం ఊతమిస్తుందని అంచనా. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఆయా ముడి సరకులపై భారీ సుంకాలు పెను భారంగా మారాయని ఇండస్ట్రీ వాదన. తయారీ రంగంలో కొత్త కంపెనీల కోసం గతంలో ప్రకటించిన లాభదాయక పన్ను విధానాన్ని పొడిగించాలన్న డిమాండ్‌ గట్టిగా విన్పిస్తోంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈవీ పరిశ్రమలకు రాయితీలు పెంచాలన్న డిమాండ్‌ ఇండస్ట్రీ వర్గాల నుంచి విన్పిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…