నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ).. గత పదేళ్ల నుంచి దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి. పేరుకే ఎన్డీఏ కానీ అందులో పూర్తి పెత్తనం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)దే. 2014లో చెప్పుకోడానికి కూటమిలో కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండేవి. కానీ రానురాను ఒక్కో పార్టీ దూరమవుతూ వచ్చాయి. ఆ జాబితాలో తాజాగా తమిళనాడులోని బలమైన ద్రవిడ పార్టీల్లో ఒకటైన అన్నాడీఎంకే చేరింది. దశాబ్దకాలంలో బీజేపీకి దూరమైన మిత్రపక్షాల్లో తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. వాటిలో జేడీ(యూ), శివసేన చీలికవర్గంలో ఒకటైన ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ఇప్పటికే ప్రతిపక్ష కూటమి “ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)”లో భాగమయ్యాయి. విపక్ష కూటమి అనగానే ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని కూటమి అనో లేదంటే ఢిల్లీలో దోస్తీ – గల్లీల్లో కుస్తీ పడే పార్టీల కూటమి అనో ఎగతాళి చేస్తుండవచ్చు. కానీ ప్రతిపక్షాలకు మోదీని ఢీకొట్టే బలమైన నేతతో కూడిన మహా కూటమి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా వివిధ రాష్ట్రాల్లోని సరైన పార్టీలతో వ్యూహాత్మక పొత్తు మాత్రమే. ఎన్నికల అర్థ గణాంకాల ప్రకారం బీజేపీని ఓడించే కాంబినేషన్ ఉంటే సరిపోతుంది. ఈ క్రమంలో మిత్రపక్షాలను కోల్పోతున్న బీజేపీ వారికి తగిన అవకాశాలు కల్పిస్తోంది. మరి ఆ కూటమి అందిపుచ్చుకుంటుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై సామర్థ్యాలపై అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ నమ్మకం ఎంతగా అంటే.. దాదాపు గుడ్డి నమ్మకంగా మారింది. అది ఎంత వరకు వెళ్లిందంటే.. కీలక సమయాల్లో అన్నామలైకి పగ్గాలు వేయకపోవడం వల్ల తమిళనాడులో కీలక మిత్రపక్షం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (AIADMK)ని త్యాగం చేసుకునే వరకు వచ్చింది. అలాగని అన్నామలైని పూర్తిగా తప్పుబట్టడం సరికాదు. ఐఐఎం (IIM)-లక్నో నుంచి MBAతో పాటు అంతకు ముందు ఇంజనీరింగ్ చదువుకున్న అన్నామలై 2011 బ్యాచ్ IPS అధికారి. కర్ణాటక కేడర్‌కు చెందిన అతను బీజేపీలో చేరడానికి ముందు పదవీవిరమణ చేశారు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో బలమైన గౌండర్ సామాజికవర్గానికి చెందిన 39 ఏళ్ల అన్నామలై 2019లో పార్టీలో చేరిన ఏడాదిలోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అన్నామలై అనుసరిస్తున్న హిందుత్వ ఎజెండా, దూకుడుతో తమిళ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన పెరియార్ ఈవి రామస్వామి, సీఎన్ అన్నాదురై వంటి దిగ్గజాలపై నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే పార్టీకి ఆగ్రహాన్ని తెప్పించింది. అదే బీజేపీతో తెగతెంపులు చేసుకోడానికి ప్రధాన కారణంగా చూపింది. అయితే ఈ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు. అన్నామలై తీరు గురించి కొంతకాలంగా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూనే వచ్చారు. ఢిల్లీకి వచ్చి మరీ బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
అన్నాడీఎంకే నిష్క్రమణతో బీజేపీ కేవలం తమిళనాట ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. దక్షిణాదిన కర్ణాటక మినహా మరెక్కడా కమలదళానికి పట్టు లేదు. తెలంగాణలో ఒక దశలో బలపడినట్టు కనిపించినా.. ఇప్పుడు త్రిముఖపోరులో ఏ స్థానంలో నిలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో సొంతంగా బలపడే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. తమిళనాట అన్నాడీఎంకేతో సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఉమ్మడిగా ఎన్నో కొన్ని స్థానాల్లో గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని కోల్పోయినట్టయింది. దక్షిణాదిన పార్టీని విస్తరించాలన్న ఆశలపై నీళ్లు జల్లినట్టయింది.
కూటమి నుంచి పార్టీలు దూరమవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉండొచ్చు. ‘సంకీర్ణ ధర్మం’ గురించి అనర్గళంగా మాట్లాడిన అటల్ బిహారీ వాజ్‌పేయి రోజుల నుంచి ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా కారణం కావొచ్చు. మోడీ-షా ద్వయం నాయకత్వంలో బీజేపీ మిత్రపక్షం ఇష్టాయిష్టాల పనిలేకుండా, అభిరుచులను పట్టించుకోకుండా ఒంటరిగా ముందుకు సాగే ధోరణిని ప్రదర్శిస్తోందన్న విమర్శలున్నాయి. లోక్‌సభలో తిరుగులేని బలం కూడా ఆ ధోరణికి దోహపడి ఉండొచ్చు. కారణాలేమైతేనేం.. ఎన్నికల సమయంలో కావాల్సింది ఓట్లు. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రమే పట్టు కల్గిన బీజేపీ, మిగతా రాష్ట్రాల్లో విస్తరించలేనప్పుడు మిత్రపక్షాల సహాయం కచ్చితంగా అవసరమవుతుంది. విపక్ష కూటమి వరుస సమావేశాలతో ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో సమావేశాన్ని నిర్వహించింది. కానీ అందులో ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలే ఎక్కువ.
ఇప్పటి వరకు లోక్‌సభలో ఎన్డీఏకు మొత్తం 324 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో బీజేపీకే సొంతంగా 301 మంది ఎంపీలున్నారు. 13 మంది ఎంపీలతో శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఐదుగురు, అప్నాదళ్‌కు చెందిన ఇద్దరు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఎన్డీయేలో ఉన్న పార్టీల్లో 9 పార్టీలకు ఒక్కొక్కరు మాత్రమే ఎంపీలు ఉండగా, 20 పార్టీలకు అసలు పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనూ ప్రాతినిథ్యం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అజేయుడు అనుకోవడం అవివేకం. 2004 సార్వత్రిక ఎన్నికలను కేస్ స్టడీగా చూస్తే.. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజాదరణలో శిఖరాగ్రంలో ఉన్నారు. మరోమారు గెలుస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఔన్నత్యానికి, హుందాతనానికి, చరిష్మాకు సరితూగే ప్రతిపక్ష నాయకుడు లేడు కూడా అప్పట్లో లేడు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ఎన్డీయేను ఓడించింది. అమెరికా తరహా అధ్యక్ష ఎన్నికల మాదిరిగా నేరుగా ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉంటే ఫలితాలు మరోలా ఉండేవేమో. కానీ మనదేశంలో ఎన్నికలు రాష్ట్రాల ఎన్నికల సమాహారం. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలు (సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి పార్టీలు), జాతీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్డీఏను ఓడించాయి. ప్రజాకర్షణ గల బలమైన ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు లేవనెత్తిన స్థానిక సమస్యలు బీజేపీ చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని తిప్పికొట్టగలిగాయి.
2024 ఎన్నికలపైనే అందరి దృష్టి
2004 ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని విపక్ష కూటమి తెలివిగా వ్యవహరిస్తూ బీజేపీకి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వాటిని ఎదుర్కోలేకపోతోంది. కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తూ వచ్చింది. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా సహా మరికొన్ని రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీయే ఉంది. అక్కడ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఐక్యతను చాటుకుంటే బీజేపీకి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. బిహార్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు జేడీ(యూ), ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ కూడా కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగితే బీజేపీ 10 సీట్లు గెలవడం కూడా కష్టంగా మారొచ్చు. మహారాష్ట్రలో 2019లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 23 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు చీలిపోయిన శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)తో అధికారంలో ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో గతంలో మాదిరిగా గెలుపొందే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో గతంలో వచ్చినన్ని సీట్లు మళ్లీ వచ్చినా సరే.. బీహార్, మహారాష్ట్రలో కలిపి 40-44 సీట్లు కోల్పోతే బీజేపీ మెజారిటీ మార్కు కంటే దిగువకు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు బలమైన మిత్రపక్షాల అవసరం ఎంతైనా ఉందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష కూటమి జట్టుకట్టి ఐక్యత ప్రదర్శిస్తున్న వేళ ధీటైన కూటమిని ఏర్పాటుచేయకపోతే 2004 తరహా ఫలితాలు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం