Bengaluru Rains: బెంగళూరును ముంచెత్తిన వరదలు.. ట్రాక్టర్లపై ఉద్యోగాలకు వెళ్తున్న ఐటీ ఎంప్లాయిస్..

|

Sep 06, 2022 | 12:55 PM

Bengaluru Rains: భారీవరదలతో కర్నాటక కకావికలమవుతోంది. వరదబీభత్సానికి బెంగుళూరు నీటమునగింది. సిలికాన్‌ సిటీ జలమయంగా మారింది.

Bengaluru Rains: బెంగళూరును ముంచెత్తిన వరదలు.. ట్రాక్టర్లపై ఉద్యోగాలకు వెళ్తున్న ఐటీ ఎంప్లాయిస్..
Flooded Bengaluru
Follow us on

Bengaluru Rains: భారీవరదలతో కర్నాటక కకావికలమవుతోంది. వరదబీభత్సానికి బెంగుళూరు నీటమునగింది. సిలికాన్‌ సిటీ జలమయంగా మారింది. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్నిప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయి. రహదారులపై పొంగిపొర్లుతున్న వరదలతో వాహనదారులు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బెంగుళూరు ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. వరదల ధాటికి రెండ్రోజులుగా ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రింగ్‌ రోడ్ ప్రాంతాలు స్విమ్మింగ్‌ఫూల్స్‌ను తలపిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్‌ ఏరియాలైన వైట్‌ ఫీల్డ్‌, మహదేవపుర, బొమ్మనహళ్లి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రెండ్రోజులుగా వరదనీటిలోనే మగ్గుతున్నాయి. బెంగుళూరు రెయిన్‌బో లేఅవుట్‌తోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందల సంఖ్యలో గేటెడ్‌ కమ్యూనిటీలు చెరువులను తలపిస్తున్నాయి. వరదలతో ఇక్కట్లు పడుతున్న కాలనీవాసులను ట్రాక్టర్లలో సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక మారతహల్లి, సిల్క్‌ బోర్డు, ఎలక్ట్రానిక్‌ సిటీ, ఐటీపీఎల్‌తో పాటు రింగ్‌రోడ్డులో ఉన్న ఐటీ కంపెనీలన్నీ నీటమునగడందో ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ట్రాక్టర్లపై ఆఫీస్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..
భారీ వర్షాలు బెంగళూరును ముంచెత్తినా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అవడం, అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లో వాహనాలు నీట మునగడంతో కొందరు సాఫ్ట్‌వేరు ఉద్యోగులు తమ తమ కార్యాలయాలను చేరుకునేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని యెమలూరు నీటమునగడంతో సమీపంలోని ఐటీ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు ట్రాక్టర్లలో తమ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆఫీస్‌కు సెలవు తీసుకోలేదు. మా పని మేము చేసుకోలేకపోతున్నాం. ఆఫీస్‌కు వెళ్లడానికి ట్రాక్టర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రూ. 50 లు తీసుకుని ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తున్నారు’ అని ఓ ఐటీ ఎంప్లాయ్ మీడియా ముందు తమ గోడును వెల్లబోసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..