గాంధీలో క‌రోనా రోగి మృతి..డాక్ట‌ర్ల‌పై దాడి చేసిన బంధువులుః మంత్రి ఈట‌ల ఫైర్‌

గాంధీ ఆస్పత్రి డాక్టర్లపై జరిగిన దాడిని మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని..

గాంధీలో క‌రోనా రోగి మృతి..డాక్ట‌ర్ల‌పై దాడి చేసిన బంధువులుః మంత్రి ఈట‌ల ఫైర్‌
Follow us

|

Updated on: Apr 02, 2020 | 6:26 AM

హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద బుధ‌వారం ఉన్న‌ట్టుండి ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. రోగి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిన తర్వాత అదే వార్డులో చికిత్స పొందుతున్న అతని సోద‌రుడు వైద్యులపై దాడి చేశాడంటూ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డా. శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఉన్న‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ రోగుల‌కు సేవలందిస్తున్న వైద్యులపై దాడి సరికాదని శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.
విష‌యం తెలుసుకున్న హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ స్వ‌యంగా రంగంలోకి దిగి జూడాల‌కు స‌ర్ది చెప్పి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంత‌రం  దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు కూడా  కరోనా వైర‌స్ సోకిన వ్యక్తి కావటంతో నిందితుణ్ని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు.

గాంధీ ఆస్పత్రి డాక్టర్లపై జరిగిన దాడిని మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల స్పష్టం చేశారు. వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని.. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని గుర్తు చేశారు. వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రతి డాక్టర్‌కూ రక్షణ కల్పిస్తామని మంత్రి ఈట‌ల భరోసానిచ్చారు.

మరోవైపు, ఈ ఘటనను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఖండించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా వైద్యులు రాత్రింబ‌వ‌ళ్లు కష్టపడి పని చేస్తున్నార‌ని చెప్పారు. అటువంటి వారికి స‌హ‌క‌రించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సరికాదన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయితే, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Latest Articles