ఈ ఒక్కటి వేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడికిపోయిద్ది.. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు..

మార్కెట్‌లో కొన్న ముదురు మటన్ ఎంత ఉడికించినా మెత్తగా కాక ఇబ్బంది పడుతున్నారా? పచ్చి బొప్పాయి, పెరుగు వంటి సహజ పదార్థాలతో చేసే చిన్న మారినేషన్ ట్రిక్ పాటిస్తే ముదురు మటన్ కూడా దూదిలా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్‌లో సరైన విధంగా ఉడికించే పద్ధతితో జ్యూసీ, రుచికరమైన మటన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ ఒక్కటి వేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడికిపోయిద్ది.. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు..
Mutton Cooking Tips

Updated on: Jul 30, 2026 | 6:22 PM

నాన్ వెజ్ ప్రియులలో చాలామందికి మటన్ కూర అంటే ప్రాణం. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన మటన్ ముదురుగా (గట్టిగా) ఉంటే ఎంతసేపు ఉడికించినా సరిగ్గా ఉడకదు. ముక్క నమలడం కూడా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు.. ఎక్కువ సమయం ఉడకబెట్టడం, కర్రీ చేయడం గంటల తరబడి ప్రాసెస్ జరుగుతుంది. అయితే.. అలాంటి ముదురు మటన్‌ను కూడా నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా, టేస్టీగా ఎలా వండుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఒక సులభమైన నాచురల్ టిప్‌తో అద్దిరిపోయే విధంగా మటన్ కర్రీ (మేక మాసం కూర) ని సింపుల్ గా వండుకోవచ్చు..

ముదురు మటన్ మెత్తగా ఉడకడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్:

సాధారణంగా మటన్ త్వరగా ఉడకడానికి లేదా టెండరైజ్ (Soft Meat) అవ్వడానికి రసాయనాలు వాడకుండా ఇంట్లోనే ఉండే ప్రకృతిసిద్ధమైన పదార్థాలను ఉపయోగించవచ్చు.. దాని కోసం పచ్చి బొప్పాయి (Raw Papaya Paste) ఉంటే సరిపోతుంది.

పచ్చి బొప్పాయిని పొట్టు లేదా తొక్కతో సహా కొద్దిగా గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి.

మటన్‌ను శుభ్రం చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఈ పచ్చి బొప్పాయి పేస్ట్‌ను ఒక స్పూన్ వేసి ముక్కలకు బాగా పట్టించాలి (Marination).

ఇలా కనీసం 20 నుండి 30 నిమిషాలు నానబెడితే (మారినేట్ చేస్తే) బొప్పాయిలోని ఎంజైములు ముదురు మాంసం కణజాలాన్ని తుంచి, ముక్కను చాలా త్వరగా, దూదిలా మెత్తగా ఉడికేలా చేస్తాయి.

పెరుగు లేదా నిమ్మరసం (Yogurt / Lemon):

బొప్పాయి అందుబాటులో లేనప్పుడు మటన్‌ను మారినేషన్ చేసే సమయంలో పెరుగు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపి నానబెట్టినా కూడా ముక్క సులువుగా ఉడుకుతుంది.

కుక్కర్ వంటకం చిట్కా:

ముదురు మటన్‌ను నేరుగా బాణలిలో కాకుండా విజిల్ కుక్కర్‌లో ఉడికించడం మంచిది. మారినేట్ చేసిన మటన్‌ను కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌పై 5 నుండి 6 విజిళ్లు వచ్చే వరకు ఉడికిస్తే మటన్ నుంచి రసం/గ్రేవీ బాగా పట్టి ముక్క మెత్తగా మారుతుంది.

కుక్కర్‌లో నూనె వేడి చేసి హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. తరిగిన టమాటాలు వేసి మగ్గాక, మారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి 6-8 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు సన్నని మంటపై ఉంచి దించాలి..

కూర రుచిగా రావడానికి ఇతర సూచనలు:

మటన్‌ను ముందుగా కడిగిన తర్వాత నీరు లేకుండా గట్టిగా పిండి తీయాలి.

మసాలాలు నూనెలో బాగా వేగిన తర్వాతే మారినేట్ చేసిన మటన్‌ను కలపాలి.

ఈ పద్ధతిలో వండితే ముదురు మటన్ అయినా కూడా అస్సలు రబ్బరులా కాకుండా జ్యూసీగా, దూది లాగా మెత్తగా ఉడికి నోరూరించే టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ తయారవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us