అమెరికాలో మళ్ళీ ప్రభుత్వ ‘పాక్షిక షట్ డౌన్’ తప్పదా ? కోవిడ్ ఎయిడ్ బిల్లుకు మోకాలడ్డిన ట్రంప్, కోట్లాది అమెరికన్ల బెంబేలు

అమెరికాలో మళ్ళీ పాక్షిక 'షట్ డౌన్' మంగళవారం నుంచి ప్రారంభం కావచ్చు. అంటే ప్రభుత్వ సంస్థలు, ఏజన్సీలకు నిధులు అందబోవు. ప్రభుత్వ కార్యకలాపాలు దాదాపు స్తంభించి పోతాయి. ఒక విధంగా ప్రజా జీవనమే..

అమెరికాలో మళ్ళీ ప్రభుత్వ 'పాక్షిక షట్ డౌన్' తప్పదా ? కోవిడ్ ఎయిడ్ బిల్లుకు మోకాలడ్డిన ట్రంప్, కోట్లాది అమెరికన్ల బెంబేలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 6:02 PM

అమెరికాలో మళ్ళీ పాక్షిక ‘షట్ డౌన్’ మంగళవారం నుంచి ప్రారంభం కావచ్చు. అంటే ప్రభుత్వ సంస్థలు, ఏజన్సీలకు నిధులు అందబోవు. ప్రభుత్వ కార్యకలాపాలు దాదాపు స్తంభించి పోతాయి. ఒక విధంగా ప్రజా జీవనమే అతలాకుతలమవుతుంది. 2.3 ట్రిలియన్ డాలర్ల  భారీ పాండమిక్ ఎయిడ్ బిల్లుపై సంతకం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడమే ఇందుకు కారణం. ఫలితంగా కోట్లాది అమెరికన్లకు జాబ్ లెస్ బెనిఫిట్లు ( ఉపాధి లేనందుకు ప్రభుత్వం నుంచి లభించే నగదు పరిహారం)  దక్కక పోవచ్ఛునని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సంతకం లేనిదే దాదాపు 14 మిలియన్ల మంది తమ అదనపు ప్రయోజనాలను పొందలేకపోతారని లేబర్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. మంగళవారం లోగా ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయాలి.. ఆ తరువాత దీన్ని సెనేట్ ఆమోదించాలి.. ఆలా జరగకపోతే ప్రభుత్వ పాక్షిక ‘మూసివేత’ ప్రమాదం పొంచి ఉంది. తమకు ఆర్ధిక కష్టాలు తప్పవేమోనని  ఇప్పటినుంచే అమెరికన్లు భయపడుతున్నారు. నిజానికి నెలల తరబడి మంతనాల అనంతరం డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఈ ప్యాకేజీ బిల్లును ఆమోదించారు.  బిల్లుపై సంతకం చేయడానికి నిరాకరించడం ద్వారా ట్రంప్ తన రిపబ్లికన్ ఎంపీలను కూడా ఆశ్చర్య పరిచారు. జనవరి 20 న ఈయన అధికారం నుంచి వైదొలగి జో బైడెన్ కి దాన్ని అప్పగించాల్సి ఉంది. కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించడానికి అభ్యంతరం చెప్పని ట్రంప్ ఆ తరువాత మనసు మార్చుకుని యూ టర్న్ తిరిగారు.

ఇది వివిధ రంగాలకు ఎక్కువ నిధులను ఇస్తోందని ఆయన తప్పు పట్టారు. అంతేకాదు …ఎంపీలు 600 డాలర్ల బదులు ప్రజలకు 2 వేల డాలర్లను ఎందుకు  ఇవ్వడంలేదని సెటైర్ వేశారు. మన అమెరికన్లకు ఎక్కువ నిధులివ్వండి అన్నారు. ఫ్లోరిడా లోని పామ్ బీచ్ లో గల తన రిసార్ట్ లో గోల్ఫ్ ఆడుతూనే ఈ  మేరకు ట్వీట్ చేశారు. వైట్ హౌస్ అధికారులకు కూడా తమ నేత అంతరంగం అంతుబట్టలేదు. ఇక అధ్యక్షుడు కానున్న జో బైడెన్…ఈ పరిణామాలను పట్టించుకోకుండా శనివారం  తన సొంత రాష్ట్రం డెలావర్ లో హాలిడేని  ఎంజాయ్ చేస్తూ వచ్చారు.