Tirumala: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

|

Jan 10, 2025 | 1:11 PM

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.

Tirumala: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede Victims
Follow us on

తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు.
తొక్కిసలాట బాధితులతోపాటు వాళ్ల కుటుంబసభ్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ.  మొత్తం 52మందికి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం కల్పించారు.  సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు.  తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి.. ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి ఆ వెసులుబాటు కల్పించారు. క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం 52మందికి ప్రత్యేక దర్శనం చేయించారు టీటీడీ అధికారులు.

తిరుపతి స్విమ్స్‌లో ఇంకా 16మంది తొక్కిసలాట బాధితులకు చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్‌ అయిన 33మందికి 2లక్షల రూపాయల చొప్పున పరిహారం అంజేయనున్నారు బాధితులను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా  ప్రభుత్వమే తీసుకుంది.

మరోవైపు తిరుపతి తొక్కిసలాటలో మరణించిన భక్తుల మృతదేహాలను వాళ్లవాళ్ల స్వస్థలాలకు తరలిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత డెడ్‌బాడీస్‌ను కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు. తిరుపతి తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.  నలుగురిలో లావణ్య, శాంతి, రజనీది విశాఖకాగా.. నాయుడుబాబుది నర్సీపట్నం. నలుగురి మృతదేహాలనూ.. వాళ్ల స్వగృహాలకు తరలించారు. మృతదేహాలు చూసి  కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

కాగా తిరుమలలో శుక్రవారం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది.  తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనుంది. సాయంత్రానికి పరిహారం చెక్కులు అందించే యోచనలో ఉంది టీటీడీ బోర్డు. వైకుంఠ దర్శనాలు మూడురోజులకే పరిమితం చేయాలా.. మిగిలిన వారం రోజులకు టికెట్లు ఇవ్వాలా? అన్న అంశంపై అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి