పక్షద్వయశశిదృశాన్యనిశం హార్దాని సదసతాం లోకేI
ఆప్యాయంతే తు సతామసతాం చ పరిక్షయం యాన్తిII
సజ్జనులతో చేసే స్నేహాలు శుక్లపక్ష చంద్రునిలా క్రమంగా వృద్ధి పొందుతాయి. దుర్జనుల స్నేహాలు కృష్ణపక్ష చంద్రుడిలా క్షీణిస్తూ ఉంటాయని ఓ శతక కర్త బోధించాడు. రెండక్షరాల స్నేహం రెండు క్షణాలకు మాత్రమే పరిమితంకాకుండా రెండు జీవితాల ఆత్మీయ అనురాగాలను పెనవేసుకుపోయి ఆజన్మాతం అమృతప్రాయమౌతుంది. అసలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి స్నేహం ఎలా ఏర్పడుతుంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా స్నేహం ఏర్పడటానికి కూడా ఏదైనా ఫార్ములా ఉందా? అనే విషయంపై అధ్యయనం చేసిన ఇజ్రాయెల్ పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం..
శరీర వాసనలను బట్టి స్నేహ బంధాలు ఏర్పడతాయని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఇన్బాల్ రావ్రేబీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. మనుషులుకాకుండా ఇతర జంతువులు, పక్షులు, క్షీరదాలు వాటి వాటి శరీరాల నుంచి వచ్చే వాసనలను బట్టి తోటి జీవులను గుర్తిస్తాయి. అలాగే మనుషుల మధ్య ఏర్పడే స్నేహ బంధాలు కూడా సారూప్యతను కోరుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 22 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న 20 జతల స్నేహితులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడిందని అంటున్నారు. 20 జతల స్నేహితులకు ప్రత్యేకంగా కాటన్ టీ-షర్టును ధరింపజేసి, ప్రత్యేక నిబంధనల మధ్య ఒక రోజు తర్వత వారి నుంచి ఆ టీ షర్టు నమూనాలను సేకరించి ఎలక్ట్రానిక్ నోస్ (e Nose)తో పరీక్షించారు. ఈ పరికరం కెమికల్ కాంపోజిషన్‌ను గుర్తిస్తుంది. స్నేహితులు కాని వారితో పోల్చితే స్నేహితుల టీ షర్టు వాసనలు (odors) చాలా దగ్గరగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
సువాసనలను బట్టి కూడా స్నేహాలు ఏర్పడతాయి
స్నేహితుల శరీరాల నుంచి వచ్చే వాసన ఎంత దగ్గరగా ఉంటే.. వారి మధ్య స్నేహం కెమిస్ట్రీ అంత గాఢంగా ఉంటుందట. వీరి అధ్యయనం సారాంశం ఏంటంటే..సారూప్యమైన శరీర వాసనలు కలిగిన వ్యక్తులు స్నేహితులుగా మెలుగుతారని, భాషను మినహాయిస్తే భూసంబంధమైన క్షీరదాల మాదిరిగానే మానవ స్నేహాలు కూడా వాసన ఆధారితమైనవని తేల్చారు. మీరేమంటారు.. సైంటిస్టులు చెప్పిన ఈ ల్యాబ్ టెస్టులను మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ల రూపంలో వ్యక్తం చేయండి..