మహారాష్ట్ర : పాకిస్తాన్ ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ విమర్శలు చేశారు. పుల్వామా ఘటన వల్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రధాని మోదీ.. పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివాళ దశకు పాకిస్థాన్ చేరుకున్నదని, ఆ దేశం ఇప్పుడు ఉగ్రవాదానికి మరోపేరుగా మారిందని అన్నారు. పుల్వామాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎప్ జవాన్లు మృత్యు వాతపడ్డారు. ఈ ఘటన ఎంతో వేదనకు గురిచేసిందని, ఆ జవాన్ల కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అని మోదీ అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వారి త్యాగం వృధాపోదన్నారు. ఇంతటి దారుణ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థ ఏదైనా.. వాళ్లు దాచుకుననేందుకు ఎంత ప్రయత్నించినా తప్పించుకుపోలేరన్నారు. ఉగ్రమూకలను అణిచివేసేందుకు సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు.