దిల్లీ: జియో వచ్చాక టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ, ఇన్నీ కావు. అనతికాలంలోనే టాప్ రేంజ్‌లో కష్టమర్స్‌ను సంపాదించుకున్న జియో తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది. కేవలం డేటా, కాల్స్ పరంగానే కాదు… డౌన్‌లోడ్ వేగంలో అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. గత 13 నెలలుగా డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోనే మొదటి స్థానంలో ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం జనవరిలో 18.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో తొలి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం కంటే ఇది రెట్టింపు. 9.5ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉండగా, వొడాఫోన్ 6.7ఎంబీపీఎస్, ఐడియా 5.5ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌ను అందిస్తుండగా, జియో కేవలం 4జీ సర్వీసులను మాత్రమే వినియోగదారులకు అందిస్తోంది.
ఇక అప్‌లోడ్ వేగంలో ఐడియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అక్టోబరు, డిసెంబరు నెలలో ఐడియా, వొడాఫోన్ అప్‌లోడ్ వేగం తగ్గినప్పటికీ జనవరిలో పుంజుకుంది. ఐడియా అప్‌లోడ్ వేగం 5.8ఎంబీపీఎస్ కాగా, వొడాఫోన్ 5.4ఎంబీపీఎస్‌తో రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత జియో 4.4ఎంబీపీఎస్ వేగం, ఎయిర్‌టెల్ 3.8ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. 2018లో అత్యంత వేగమైన 4జీ ఆపరేటర్‌గా రిలయన్స్ జియో నిలిచింది.