ప్రపంచాన్ని కుదిపేస్తున్నే కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరో ఊరట కలిగించే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, ఎలాంటి భారీ ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) చోటుచేసుకోలేదంటున్నారు. దీనికి సంబంధించిన రెండు దేశవ్యాప్త అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలకు చేరుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మ్యుటేషన్ల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇది వ్యాక్సిన్ సమర్థతపై ఆందోళన కలిగించింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ జన్యుక్రమంపై ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) అధ్యయనాలు చేసింది. ప్రస్తుతం వైరస్ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, భారీ మ్యుటేషన్లు చోటు చేసుకోలేదని ఈ పాన్ ఇండియా సర్వేలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ జన్యుపరంగా 5.39శాతం మ్యుటేషన్లు చెందినట్లు గత నెలలో జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది దాదాపు 72 దేశాల్లో ఇదే రకంగా ఉన్నట్లు పరిశోధన బృందం పేర్కొంది. అమెరికాలో 3.27శాతం ఉండగా, యూకేలో 3.59శాతం, కానీ భారత్‌లో అది 5.39 శాతంగా ఉందని తేల్చారు. వివిధ దేశాల్లో ఇదే రకంగా స్వల్ప మ్యుటేషన్లు జరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది.
అయితే, కాలానుగుణంగా ఈ స్వల్ప మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. కానీ, ఉత్పరివర్తనాల్లో భారీ మార్పులు సంభవించడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇటీవలే వెల్లడించారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఏర్పడే డ్రిఫ్ట్స్‌ల వల్ల టీకా అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సాధారణంగా వైరస్ జన్యునిర్మాణంలో వచ్చే మార్పులనే ఉత్పరివర్తనాలుగా (మ్యుటేషన్) వ్యవహరిస్తారు. అయితే, ఇలా ఎన్నోసార్లు మ్యుటేషన్లు జరుగుతూ కొత్తరకం వైరస్‌గా మారుతాయి. ఇలా మార్పులు చెందిన రకం ఒక్కోసారి తక్కువ ప్రభావవంతంగానూ, మరికొన్ని సార్లు వ్యాక్సిన్, ఔషధాలకు లొంగకుండా తయారవుతాయి. అయితే, కరోనా వైరస్ విషయంలో మాత్రం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న కరోనా టీకాలపై ప్రస్తుత మ్యుటేషన్ల ప్రభావం ఏమీ ఉండదని అంతర్జాతీయ అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలాఉంటే, భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా పంపిణీ చేయాలనే అంశంపై ఇప్పటికే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. దేశ భౌగోళిక పరిస్థితులు, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టీకా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు, నిపుణులకు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ప్రాధాన్యతను బట్టి టీకా సరఫరా చేయాలని సూచించారు.