పాకిస్తాన్ లో మైనార్టీ వర్గాలకు ఏమాత్రం రక్షణ లేదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి స్పష్టం చేసింది. అడుగడుగునా ఉగ్రవాదానికి ఊతమిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుందని భారత్ మరోసారి ఎండగట్టింది.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో పాక్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మైనారిటీలను నిరంతరం అణచివేతకు గురిచేసే పాకిస్తాన్ మానవ హక్కులపై ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు భారత్ సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. పాక్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని.. పలువురికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్టు ఆ దేశ ప్రధానమంత్రే స్వయంగా అంగీకరించారని తేల్చి చెప్పింది.
‘‘భౌగోళిక, మతపరమైన మైనారిటీలను అణచివేతకు గురిచేసే దేశం నుంచి మానవ హక్కులకు సంబంధించిన ఉపన్యాసాలు వినేందుకు భారత దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. ఐక్యరాజ్యసమితి నిందితుల జాబితాలో ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేయటం పాక్‌కే చెల్లింది. జమ్ముకశ్మీరులో వేలాది మందికి తీవ్రవాద శిక్షణ నిచ్చామని గర్వంగా చెప్పుకున్న ప్రధాని ఉన్న దేశం అది. మానవ హక్కుల అమలులో దారుణంగా విఫలమైన ఆ దేశం, అంతర్జాతీయ సమాజం కన్ను కప్పేందుకు భారత అంతర్గత వ్యవహారాలపై ఆరోపణలు చేస్తోంది’’ అని భారత ప్రతినిధి స్పష్టం చేశారు.
పాక్ దుర్మార్గాలను ఐక్యరాజ్య సమితి వేదికగా వివరిస్తూ భారత్‌లో అంతర్భాతమైన జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌లలోని పాక్ ఆక్రమించిన ప్రాంతాల్లో స్థానిక కశ్మీరు ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. భారీగా ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశిస్తున్న పరాయివారి వల్ల వేలాది సంఖ్యలో సిక్కు, హిందూ, క్రిస్టియన్ మైనారిటీలకు చెందిన మహిళలు, యువతులు అపహరణలకు, బలవంతపు వివాహం, మతమార్పిడులకు గురౌతున్నారు. ఇక ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ భద్రతా దళాల అపహరణకు గురి కాని కుటుంబం ఒక్కటి కూడా లేదు. ఆ కుటుంబాలలో ఎవరో ఒకరిని పాక్ సైన్యం మాయం చేయని రోజు లేదని భారత్ వివరించింది.
India ?? in Geneva #HRC45
Statement delivered by Amb. Indramani Pandey during the General Debate on Oral Update by the High Commissioner of Human Rights|
++read full text at: https://t.co/Kk96xIm1Yj,,@PIB_India @diprjk pic.twitter.com/PN17i9I0u9
— India at UN, Geneva (@IndiaUNGeneva) September 15, 2020
అటు టర్కీకి కూడా భారత్ చురకలు అంటించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవటం మాని, ప్రజాస్వామిక విధానాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని టర్కీకి భారత్ సూచించింది. అంతే కాకుండా పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఐసీ) వాఖ్యలను తాము ఖాతరు చేయబోమని భారత ప్రతినిధులు స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం నిలిపివేత, తీవ్రవాద చర్యల కట్టడిలో పాక్ వైఫల్యం పట్ల ఇతర దేశాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని వారు వెల్లడించారు.