ఆస్ట్రేలియా క్రికెట్‌లో జాతివివక్ష లేదనడం అర్థరహితం.. తెల్లతోలు పొగరు అక్కడా ఉంది… ఆ జట్టులో కీలక సభ్యుడు ఉస్మాన్ ఖవాజాను అడిగితే జాతి వివక్ష ఎలా ఉంటుందో చెబుతాడు. తాను సోమరి క్రికెటర్ అన్న భావన కలగడానికి తన జాతే కారణమని ఖవాజా ఆవేదనగా చెప్పుకొచ్చాడు.. ప్రశాంతంగా ఉండటమన్నది వారికి సోమరితనంగా అనిపించవచ్చన్నాడు.. పాకిస్తాన్‌లో పుట్టి పెరిగినందువల్ల తనపై ఆ అభిప్రాయం కలగడానికి కారణం కావచ్చేమోనని అనుమానపడ్డాడు. ఆస్ట్రేలియాలో కొందరు ఉపఖండ ప్రజలను సోమరిపోతులుగా చూస్తారు.. వారు కష్టపడి పనిచేయరనే భావనతో ఉంటారు.. అందరిలా తాను వేగంగా పరుగెత్తలేనని, దాన్ని కూడా భూతద్ధంలో చూస్తూ వివక్ష చూపడం సరికాదని బాధపడ్డాడు.. ఫిట్‌నెస్ టెస్ట్‌లప్పుడు మిగతావారితో పోలిస్తే తాను వేగంగా పరుగెత్తలేకపోయేవాడినని, దాన్ని కూడా జాతిని అంటగట్టడమేమిటని ప్రశ్నించాడు ఖవాజా. ఇదివరకే జాతి వివక్షపై ఆస్ట్రేలియాకే చెందిన డేన్ క్రిస్టియన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు క్రిస్టియన్‌తో ఖవాజా స్వరం కలిపాడు.. పాకిస్తాన్‌లో పుట్టిన ఖవాజా తన అయిదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 44 టెస్ట్ మ్యాచ్‌లు, 40 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు.. తొమ్మిది టీ-20 మ్యాచ్‌లు కూడా ఇతడి ఖాతాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్న ఉపఖండపు ప్లేయర్లు చాలా మందే ఉన్నారు.. గురీందర్ సాంధూ, అర్జున్ నాయర్, జాసన్ సంఘా, తన్వీర్ సంఘా .. వీరు ఆసీస్ తరఫున ఆడే అవకాశం ఎప్పుడొస్తుందో…! ఆస్ట్రేలియాలో జాత్యంహారం ఎక్కువే! నిజంగానే ఉపఖండపు ఆటగాళ్లను చూస్తే ఓర్వలేరు.. 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత-పాకిస్తాన్‌లు తలపడ్డాయి.. అప్పుడు స్టేడియంలో కొన్ని బ్యానర్లలో రెండు జట్లను ఎగతాళి చేస్తూ రాసిన రాతలే కనిపించాయి.. ఫైనల్ మ్యాచ్ ట్రామ్ డ్రైవర్స్, బస్ కండక్టర్ల మధ్య జరుగుతుందన్నది ఆ బ్యానర్‌లో రాసిన రాతల సారాంశం..