ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కేవలం ముఖ్యమంత్రికే కాదు.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈ నోటీసులు జారీ చేసింది. 2014 ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌తో పాటు.. 2018 ఎన్నికల్లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌తోపాటు ఆ రెండు ఎన్నికల మధ్య కాలంలో ఏటా ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులను తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. పలు పత్రాల్లో ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించి భారీ తేడాలు ఉంటే.. అందుకు కారణాలను ఆధారాలతో సహా వివరించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2014, 2018ల్లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లు ఇవ్వండి..
అంతేకాకుండా, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీఆర్‌ఎస్ తరపున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్, అంతకు ముందు సంవత్సరాల్లో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. కాగా, గత ఏడాది డిసెంబరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కానీ, ఆయా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.
భారీ తేడాలు..
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులూ వచ్చిన సమాచారం లేదు. దాంతో, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల లెక్కలను మరోసారి సరి చూసుకునే పనిలో పడ్డారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారం, ఐటీ రిటర్న్స్ వివరాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటున్నారు. అయితే, అఫిడవిట్లు, ఐటీ రిటర్నుల్లో గణాంకాల మధ్య పెద్దగా తేడా లేని వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. అఫిడవిట్లకు, ఏటా దాఖలు చేసిన ఐటీ రిటర్నులకు మధ్య భారీ తేడా ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఐటీ నోటీసులతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అఫిడవిట్లకు, ఐటీ రిటర్నులకు లింక్..
నిజానికి, ప్రజా ప్రతినిధులు నామినేషన్ సమయంలో తమ ఆస్తులు, ఆదాయం, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ల రూపంలో ఈసీకి సమర్పిస్తారు. ఇవన్నీ బహిరంగ రహస్యమే. అలాగే, టీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా 2014, 2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్లను సమర్పించారు. పలువురు అభ్యర్థులకు ఆస్తులు, అప్పుల్లో తేడాలు కనిపించాయి. ఈ పరిణామం పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏటా సమర్పించిన ఐటీ రిటర్నుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆస్తి ఎక్కువగా చూపినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో వివరాలు లేవని ఐటీ శాఖ గుర్తించినట్లు తెలిసింది. ప్రత్యేకించి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో కొందరు ఎక్కువ ఆస్తులు చూపి, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తక్కువ ఆస్తి చూపారని సమాచారం.
ఇప్పుడు టార్గెట్ టీఆర్ఎస్సా.. ?
కాగా, దేశవ్యాప్తంగా కొంత కాలంగా తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు ప్రమేయంతోనే ఈ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు రావడం.. రాజకీయ ప్రేరితమా లేక అధికారిక లాంఛనాల్లో భాగమా అనే అంశంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.