ఇన్‌స్టాగ్రామ్.. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. ఫేస్‌బుక్ మరుగునపడిన తర్వాత ఇన్‌స్టాకు యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. ఎప్పటినుంచో పోస్టులకు లైక్స్ కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతీ వీడియో, ఫోటోకు వచ్చే లైక్ ఆప్షన్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ లైకులు కేవలం పెట్టిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయని.. ఫాలోవర్స్, బ్రౌజ్ చేసే ఇతర వ్యక్తులకు లైకులు కనిపించకుండా ఉండేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఈ విధానాన్ని అమెరికాలో ప్రారంభించనుండగా.. త్వరలోనే ఇండియాలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈ ఆప్షన్‌ను ఇండియాలో తీసుకొస్తే.. కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌లో లైకుల ద్వారానే బిజినెస్ జరుగుతుందని.. ఏదైనా కంపెనీ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటే.. లైకులే కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అటు టిక్ టాక్ వంటి యాప్‌లు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించడంతో.. ఇన్‌స్టా లైక్స్ ఆప్షన్‌లో మార్పులు తీసుకురావడం ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.