స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. సౌలభ్యాలు ఎన్ని పెరిగాయో.. అనర్థాలు, మోసాలు కూడా అంతే పెరిగాయి. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఎదో యాప్ డౌన్‌లోడ్ చేయడం అందరికీ అలవాటే. అయితే ఆ యాప్‌లలో కొన్ని మోసాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. మన ఫోన్‌లో కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే కొన్ని ప్రక్రియలు జరిగిపోతుంటాయి. దానికి కారణం కొన్ని మాల్ వేర్ ఎటాక్స్. అన్ని యాప్స్ క్షుణ్ణంగా పరీక్షించి డౌన్‌లోడ్ చేసుకుని.. ఇక మన ఫోన్ సేఫ్ అనుకున్నా.. మళ్లీ ఏదో రూపంలో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ మాల్‌వేర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మాల్‌వేర్‌కు సంబంధించిన యాప్స్‌ని గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ డిలీట్ చేస్తూనే ఉంది. అయినా కూడా కొత్తకొత్త యాప్స్‌లో మాల్‌వేర్ మళ్లీ బయటపడుతోంది.
తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే వచ్చింది. ai.type కీబోర్డ్ యాప్‌లో మాల్‌వేర్ ఉన్న విషయం బయటపడటంతో.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్‌స్ట్రీమ్‌కు చెందిన పరిశోధకులు ai.type కీబోర్డ్ యాప్ యూజర్లను దోచుకున్న విషయాన్ని బయటపెట్టారు. ఈ యాప్ కీబోర్డ్ ఉపయోగించే వినియోగదారుల బ్యాంకు అకౌంట్లు అటోమెటిక్‌గా ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. వినియోగదారుల ప్రమేయం లేకుండానే.. ప్రీమియం థర్డ్ పార్టీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్లు వీరి పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. మీరు కూడా ఒకవేళ ఈ కీబోర్డ్ యాప్ వాడుతున్నారంటే.. మీకు తెలియకుండా మీ అకౌంట్ల నుంచి డబ్బులు ఖాళీ అవుతుంటాయి.
ఇప్పటివరకు ఈ మాల్‌వేర్ ఎఫెక్ట్‌తో 1.4 కోట్ల పేమెంట్ రిక్వెస్ట్‌లు జరిగినట్లు అప్‌స్ట్రీమ్ పరిశోధకులు వెల్లడించారు. సెక్యూరిటీ-డీ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చిన ఆ రిక్వెస్టులను బ్లాక్ చేశారు. లక్ష పదివేల డివైజ్‌ల నుంచి ఈ రిక్వెస్ట్‌లు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి 2019 జూన్‌లోనే గూగుల్ డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఈ యాప్‌ను కొందరు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారంతా డిలీట్ చేయకపోవడంతో.. చిక్కుల్లో పడిపోయారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో లేకపోయినా.. థర్డ్ పార్టీ యాప్‌స్టోర్‌లలో ఉంది. అక్కడ్నుంచి లక్షలాది మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో గనుక ఈ యాప్ ఉపయోగిస్తున్నా.. ఉన్నా వెంటనే డిలిట్ చేయడం ఎంతో మంచిది.