మరో వికెట్: సంజయ్ ఝాను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మరో సీనియర్‌ నేతను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. రాజస్తాన్‌లో తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌పై వేటు వేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతుగా నిలిచిన సంజయ్‌ ఝాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

మరో వికెట్: సంజయ్ ఝాను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ
Follow us

|

Updated on: Jul 15, 2020 | 4:05 PM

దేశం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత విబేధాలు భగ్గుమంటున్నాయి. రాజస్తాన్ లో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయేంత పని జరిగింది. తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మరో సీనియర్‌ నేతను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. రాజస్తాన్‌లో తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌పై వేటు వేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతుగా నిలిచిన సంజయ్‌ ఝాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ మంగళవారం రాత్రి ట్విటర్‌ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

సచిన్‌ ఫైలట్ ను పార్టీ నుంచి తొలగింపును తప్పుబట్టిన సంజయ్‌ ఝా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సచిన్‌ పైలట్‌ 2013 నుంచి 2018 వరకూ ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం రక్తం ధారపోసి కష్టపడ్డారని ఝా అన్నారు. రాజస్థాన్‌లో 21 సీట్లున్న పార్టీని 100 సీట్లకు తెచ్చిన ఘనత పైలట్‌కే దక్కుతుందని తెలిపారు. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి తొలగించడం దారుణమని ఝా మండిపడ్డారు.

ప్రసార మాధ్యమాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫు తరచూ పాల్గొనే సంజయ్ ఝాను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి అధిష్ఠానం ఇటీవలే తప్పించింది. పార్టీలోని లోపాల్ని ఎత్తిచూపుతూ ఇటీవల ఆయన ఓ ప్రముఖ పత్రికలో వ్యాసం రాయడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యవహారించినందుకు ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాశ్వతంగా బహిష్కరించింది.