చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడు మహ్మద్ రఫి కి ఉరిశిక్ష అమలు జరుగుతుందా… కోర్టు ఆదేశాల తర్వాత ఏమి జరగబోతోంది.. నిందితుడుని ఎక్కడ ఉరి తీస్తారు.. ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులకు ఆరేళ్ల తర్వాత కూడా ఉరిశిక్ష కాకుండా అనేక ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో మహ్మద్ రఫి విషయంలోనైనా ఈ శిక్ష కచ్చితంగా అమలు అవుతుందా…
ఫోక్సో యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ లో న్యాయస్థానం ఒక కామాంధుడికి విధించిన తొలి ఉరిశిక్ష.. ఆ రికార్డ్ ను చిత్తూరు జిల్లా న్యాయస్థానం సాధించింది. కామంతో కళ్లుమూసుకుపోయి పైశాచికత్వంతో పసిబిడ్డను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపేసిన మృగం మహ్మద్ రఫికి న్యాయస్థానం విధించిన ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుంది ఇప్పుడ ఇదే చర్చ.. ఎక్కడ ఉరితీస్తారు అనేది ప్రశ్న.. ఢిల్లీ నిర్భయ కేసులో ఇప్పటివరకూ శిక్షఅమలు కాలేదు మరి ఈకేసులో దోషికి శిక్షఅమలవుతుందా అనే ఆందోళన.. ప్రాణానికి ప్రాణం.. తీయాల్సిందేనని డిమాండ్… నువ్వు చేసిన హీనమైన పనికి నీకు మరణదండనే సరైన శిక్ష…మనుషుల మధ్య నీలాంటి మృగం బతకడానికివీల్లేదని న్యాయమూర్తి వెంకటహరినాధ్ చేసిన వ్యాఖ్యలు కామాంధులందరికీ చెంపపెట్టులాంటిదే..అయితే చిత్తూరు జిల్లా ఫోక్సో కోర్టు ఉరిశిక్ష విధించినప్పటికీ ఆ శిక్షని హైకోర్టు ఆమోదించాల్సి ఉంటుంది. జిల్లా న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం ర్యాటిఫై చేసిన తర్వాత మాత్రమే శిక్ష అమలవుతుంది.
అదేదో సినిమాలో చెప్పినట్టు రాత్రికిరాత్రి శిక్ష అమలు కాదు.అందరూ ఎదురు చూస్తున్నట్టు అప్పడే ఆ కామాంధుడు ఉరికంభం ఎక్కే అవకాశం ఉండదు.. ఇందుకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక కేసులో నిందితుడికి శిక్ష విధించడానికి ఒక సెక్షన్ ఉంటే అదే కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు వందసెక్షన్లు ఉన్నాయి.. వందమంది ధోషులు తప్పించుకున్న ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా బలవ్వకూడదనే చట్టంలో ఉన్న సానుభూతి మార్గాలను ఎంచుకుని ఉరిశిక్ష పడిన తర్వాత నిందితులు తప్పించుకోగలుగుతున్నారు. ఢిల్లీ నిర్భయ ఘటనే ఇందుకు ఉదాహరణ.. కేసులో అన్ని సాక్ష్యాధారాలు సమర్పించి నేరం నిరూపణ అయిప్పటికీ ఆ నిందితులను ఉరి తీయలేని పరిస్థితి..చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఆ నిందితులు ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తింటూ ఈ గాలి పీల్చుకుంటూ సిక్స్ ప్యాక్ బాడీలతో హాయిగా బతికేస్తున్నారు.
ఆఖరికి రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ భారత చట్టాలకు సవాల్ విసురుతున్నారు. ఇంకా తప్పించుకోవడానికి వినయ్ కుమార్ లాంటి దోషి…తనను తాను గాయపర్చుకుని ఆసుపత్రిలో చేరి నాటకాలాడుతున్నాడు..ఈ నేపథ్యంలో మహ్మద్ రఫి శిక్ష సరిగ్గా ఎంతవరకూ అమలవుతుందనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.. ప్రస్తుతం మహ్మద్ రఫికి విధించిన ఉరిశిక్ష ఆర్డర్ కాపీ రాష్ట్ర హైకోర్టుకు చేరుతుంది. హైకోర్టు ఈ శిక్షను పరిశీలించి ర్యాటిఫై చేస్తుంది. అప్పటి నుంచి అరవైఒకటోరోజు దోషిని ఉరి తీస్తారు. ఈ అరవై రోజుల గడువే ఇలాంటి కామాంధులకు ఉరిశిక్ష పడిన ఖైదీలకు వరంలా మారింది. ఈ అరవై రోజుల్లో రకరకాల మార్గాల్లో నిందితులు ఉరిని తప్పించుకునేందుకు రకరకాల పిటిషన్లతో ముందుకు వెళ్తున్నారు.అందులో భాగంగానే ఇప్పుడు తన ఉరిని సవాల్ చేస్తూ దోషి అప్పీల్ కు వెళ్లొచ్చు..అలాగే రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు..అలాగే అనారోగ్య కారణాలతోనూ తప్పించుకోవచ్చు.. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, గాయాలతో ఉన్న వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉరి తీయకూడదనేది చట్టంలో ఉన్న నిబంధన.. ఇలా ఏ అప్పీల్ కు వెళ్లకుండా ఎలాంటి పిటిషన్లు వేయకుండా ఉంటేనే నిందితుడు మహ్మద్ రఫిని ఉరి తీస్తారు. ఉరిశిక్షపడిన ఖైదీలను సాధారణంగా అప్పటివరకూ ఉన్న జైల్లో ఉంచరు. సెంట్రల్ జైలుకు తరలిస్తారు.
అందులో భాగంగానే దోషి మహ్మద్ రఫిని కడప సెంట్రల్ జైలు చిత్తూరు జైలు నుంచి తరలించారు. అక్కడ ఉరిశిక్షపడిన ఖైదీలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రత్యేక ఖైదీగా పరిగణించి వేరే బ్యారక్ లలో ఉంచుతారు. ఆత్మహత్యా ప్రయత్నాలు లాంటి చేసుకోకుండా నిరంతరం సీసీకెమేరాల పర్యవేక్షణలో ఉంచుతారు. అరవైరోజులు పూర్తయ్యాక కోర్టు ఆదేశాలను అమలు చేస్తారు. ఇందులో భాగంగా దోషి కుటుంబసభ్యులకు ఫలానా రోజు ఉరి తీస్తున్నామని సమాచారమిస్తారు. అలాగే ఉరి తీసేందుకు తలారిని ఏర్పాటు చేస్తారు. ఉరి తీసేందుకు ప్రత్యేకమైన ఉరితాడును తెప్పిస్తారు.
ఉరి వేసేముందు దోషికి ఆరోగ్య పరీక్షలు చేస్తారు..చివరి కోరికేంటో అడిగి ఆ కోరిక ను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉతి తీసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు..ఒకవేళ కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాకపోతే జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. .. పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు మహ్మద్ రఫిని కనీసం చూడడానికి కూడా అతని తల్లిదండ్రులు భార్య, పిల్లలు జైలు దగ్గరకు రాలేదు. ఉరిశిక్షపడిందని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం స్పందించలేదు.. ఇదే అతనికి అతిపెద్ద శిక్ష అంటున్నారు న్యాయనిపుణులు..అతను చేసిన నీచమైన పనికి కనీసం తనకడుపున బుట్టిన పిల్లలు కానీ తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ రాకపోవడం మించిన శిక్ష ఉండదంటున్నారు.
ఇక ఈ అరవై రోజుల్లో ఎప్పుడు ఉరితీస్తారో ఎప్పుడు ప్రాణం పోతుందోనంటూ దోషి పడే మానసిక వేదన కూడా భయంకరమైన శిక్షలాంటిదేనంటున్నారు. మేము టేకప్ చేసిన కేసులో అతి కొద్ది కాలానికే ఉరిశిక్షవేయించామని ఆనందంలో ఉన్న చిత్తూరు పోలీసులకు ఇలాంటి టెన్షన్ లేకపోలేదు..శిక్షవేయించడం మాత్రమే కాదు అది అమలయినప్పుడే తమకి నిజమైన ఆనందమని…అదే జరిగితే ఇంకోసారి ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడాలంటే ఇలాంటి కామాంధులు భయపడే పరిస్థితి రావాలంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు..
-అశోక్ వేములపల్లి
-సీనియర్ జర్నలిస్ట్ టీవీ9