జమ్మూలోని వైష్ణవోదేవి యాత్రకు మళ్లీ బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 16వ తేదీన వైష్ణవోదేవి ఆలయాన్ని తెరవాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. యాత్ర నిర్వహణ మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో జరిగే అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం ఇప్పటికే రద్దుచేసింది. అయితే ఇప్పుడు అదే జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరవాలని ఆలయ కమిటీ భావిస్తోంది. ఆగస్టు 16 నుంచి భక్తులు వైష్ణో దేవిని సందర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్ లోయలో భద్రత , శాశ్వత రహదారి నిర్మాణం లేకపోవడం, మరోవైపు కరోనా నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర రద్దుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇక, వైష్ణో దేవి దర్శనం విషయంలో జమ్ము ప్రభుత్వం జారీ చేసిన ఎస్ఓపీ ప్రకారం ప్రతిరోజు గరిష్టంగా 500 మంది భక్తులను అమ్మవారి సందర్శనకు అనుమతించాలని భావిస్తున్నారు. అటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి భక్తునికి వైద్య పరీక్షలు చేయిస్తారు. యాత్ర నిర్వహణ పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు సమాచారం. వైష్ణో దేవి యాత్రకు వచ్చే భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, మరోవైపు రీసి జిల్లాలోని త్రికూట పర్వతాల్లో ఉన్న ఓ భవనంలో 11 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో వైష్ణవోదేవి యాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి 18వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. వైష్ణవోదేవి యాత్రపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.