హిందీలో బిగ్ బాస్ 13వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. పలు వివాదాల మధ్య విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక కంటెస్టెంట్లు… గొడవలు, రొమాన్స్, మాటల యుద్ధాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ పూనావాలా వైల్డ్ కార్డు ఎంట్రీగా షోలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడే ఈ సీజన్ హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్‌గా కూడా నిలిచాడు. కాగా ఇతడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి వరుసకు మరిది కావడం విశేషం. ఇంతటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి కొద్దిరోజులు హౌస్‌లో ఉండి ప్రేక్షకులను అలరిస్తాడని అందరూ భావించారు.. అయితే అతడు ఈవారం అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు.
సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లతో పలుమార్లు గొడవ పడ్డ తెహ్సీన్ ఇలా సడన్‌గా ఎలిమినేషన్‌కు గురి కావడంతో మిగతా హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే తెహ్సీన్ మధ్యలోనే హౌస్ నుంచి బయటికి రావడం వెనుక బలమైన కారణం ఒకటుందని అతని న్యాయవాదులు తెలిపారు. తెహ్సీన్‌కు సంబంధించిన సున్నితమైన వ్యవహారం ఒకటి ఉండటం వల్లే అతడు బయటికి రావాల్సి వచ్చిందని వారు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ మేటర్‌పై తెహ్సీన్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎలిమినేషన్ తర్వాత తాజాగా తెహ్సీన్ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఉన్నది తక్కువ రోజులైనా.. తన బిగ్ బాస్ జర్నీ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ సురక్షితమైన జోన్‌లో ఉండే తాను ఆ పరిధి ధాటి కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామని చూశానని.. అందుకే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చానని చెప్పాడు.
ఇక సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లతో ఉన్న గొడవలపై కూడా స్పందించిన తెహ్సీన్.. మా ముగ్గురి మధ్య ఉన్న ఫైట్స్ కేవలం తాత్కాలికమేనని తెలిపాడు. మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటామని చెప్పుకొచ్చాడు. తాను హౌస్‌లో ఉన్నది తక్కువ సమయం అయినా.. ప్రేక్షకులు తనపై ప్రేమను కురిపించారని చెప్పాడు.