Drought Early Warning System (DEWS) సంస్థ సర్వే ప్రకారం భారత భూభాగంలో 42 శాతం కరువు ప్రాంతంగా పరిగణించబడుతోంది. గత్ ఏడాది కంటే 6 శాతం ఎక్కువగా కరువు ప్రాంతాలు నమోదయ్యాయి. బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
చాలా గ్రామాల్లో పశువులను పోషించలేక వదిలేసిన పరిస్థితి కూడా కనబడుతోంది. మధ్యప్రదేశ్‌లో దాదాపు 91 శాతం పశువులు అలా వదిలేయబడ్డాయని సర్వేల్లో తేలింది. ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోను ఇలాంటి పరిస్థితే ఉంది. పశువులు కూడా పెద్ద ఎత్తున మరణించాయి. నీరు లభించకపోవడం, మేత లభించకపోవడం వల్ల పశుసంపదపై చాలా ప్రభావం పడింది. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో 1543 పశువులు, రాజస్థాన్‌లో 1391 పశువులు మరణించినట్లు తెలుస్తోంది. కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వ పథకాల వల్ల ఎంతమందికి ప్రయోజనం లభిస్తుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
కరువు వల్ల వాటిల్లిన నష్టం అపారంగా ఉందని రాష్ట్రాల సర్వేలు చెబుతున్నాయి. పంట నష్టం 60 శాతం నుంచి 90 శాతం వరకు ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని 19 గ్రామాల్లో దాదాపు 5562 ఎకరాల భూమి బంజరుగా వదిలేయవలసి వచ్చింది. పంటనష్టానికి పరిహారం కూడా అందించలేదు.