ఆ రోజు చరిత్రలో అత్యంత విషాద దినం. 1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 6-7 ఎకరాల్లో విస్తరించిన తోట జలియన్‌వాలాబాగ్. సిక్కుల పవిత్ర ఉత్సవమైన వైశాఖీని జరుపుకోవడానికి దాదాపు 15,000 నుంచి 20,000 మంది అక్కడకు చేరుకున్నారు. అలాగే ప్రజలను అణగదొక్కే కఠినమైన నాటి రౌలత్ చట్టానికి వ్యతిరేకించేందుకు కూడా చాలామంది కలిశారు. అప్పట్లో ఇద్దరు జాతీయ నేతలు సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూల అరెస్టు, దేశ బహిష్కారాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలిపేందుకు కూడా వారంతా తరలివచ్చారు. అయితే వైశాఖి ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినవారికి మాత్రం అక్కడ ఏం జరుగుతుందనేది తెలీదు. మహిళలు, పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. ఆ సమయంలో బ్రీటిష్ కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలతో దాదాపు 50మంది సైనికులు జలియన్‌వాలాబాగ్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే దారులన్నీ మూసివేశారు. ఏలాంటి ఆదేశాలు లేకుండా అక్కడ గుమిగూడిన వారిపై విచక్షణ రహితంగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా కొందరు పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకేశారు.
బ్రిటిష్ రికార్డుల ప్రకారం నాడు 379 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నా.. దాదాపు వెయ్యి మంది వరకు బలైపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా 1650 రౌండ్ల తూటాలు పేల్చారంటే ఎంత కర్కశంగా డయ్యరు సైన్యం కాల్పులు జరిపిందో అర్ధమవుతోంది. జలియన్ వాలాబాగ్ ఘటనపై దేశమంతా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఈ దారుణానికి కారణమైన జనరల్ డయ్యర్ లో ఏమాత్రం పశ్చాతాపం లేదు. అతనిపై విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ర్యాంకు తగ్గించడంతో సరిపుచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఉద్దాం సింగ్ అనే యోధుడు బ్రిటన్ లో డయ్యర్ ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ నెత్తుటి మరకకు నేటికి వందేళ్లు పూర్తయ్యాయి.
సిగ్గుచేటు.. బ్రిటీష్ ప్రధాని థెరిసా
జలియన్‌వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్ ప్రధాని థెరిసా మే బుధవారం వ్యాఖ్యానించారు. అయితే ఆమె అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నాటి అమానుషత్వానికి వందేళ్లయిన సందర్భంగా ఓ ప్రకటన చేశారు. 1997లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించే ముందు.. రాణి ఎలిజబెత్-2 భారత్‌తో తమ గత చరిత్రలో ఈ దురాగతం ఓ బాధాకరమైన ఉదాహరణగా పేర్కొన్న విషయాన్ని థెరిసా మే ఆ ప్రకటనలో ప్రస్తావించారు.
విచారం కాదు.. క్షమాపణలు చెప్పాల్సిందే..
అయితే బ్రిటన్ ప్రతిపక్ష నేత.. లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బైన్ మాత్రం జలియన్ వాలా బాగ్ ఘటనపై భారత్‌కు క్షమాపణ చెప్పాలని బ్రిటన్ ప్రధాని థెరిసాని డిమాండ్ చేశారు.
ఆ వీరుల శౌర్యం, త్యాగం మరిచిపోం : ప్రధాని మోదీ
హైదరాబాద్: భయానక ఘాతుకం జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగి నేటికి వందేళ్లు. ఆ రోజున ప్రాణాలు వదిలిన అమరవీరులకు భారత్ నివాళి అర్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినవారి సాహాసాన్ని, త్యాగాన్ని మరిచిపోలేమని మోదీ అన్నారు. వారి జ్ఞాపకాలు నవ భారత నిర్మాణం కోసం మరింత కష్టపడేలా చేస్తున్నాయన్నారు.
Today, when we observe 100 years of the horrific Jallianwala Bagh massacre, India pays tributes to all those martyred on that fateful day. Their valour and sacrifice will never be forgotten. Their memory inspires us to work even harder to build an India they would be proud of. pic.twitter.com/jBwZoSm41H
— Chowkidar Narendra Modi (@narendramodi) April 13, 2019
అదో క్రూరమైన ఊచకోత.. : రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా జలియన్‌వాలాబాగ్ ఘటన పట్ల ట్వీట్ చేశారు. వందేళ్ల క్రితం ఇదే రోజున స్వాతంత్య్ర సమరయోధులు అమరులయ్యారని, అదో క్రూరమైన ఊచకోత అని, నాగరికతపై ఓ మచ్చ అని రామ్‌నాథ్ ట్వీట్‌లో తెలిపారు. అమరులు చేసిన త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరవదన్నారు. జలియన్‌వాలాబాగ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తున్నట్లు కోవింద్ చెప్పారు.
A 100 years ago today, our beloved freedom fighters were martyred at Jallianwala Bagh. A horrific massacre, a stain on civilisation, that day of sacrifice can never be forgotten by India. At this solemn moment, we pay our tribute to the immortals of Jallianwala #PresidentKovind pic.twitter.com/tNt0v5aFWv
— President of India (@rashtrapatibhvn) April 13, 2019
బ్రిటీష్ కమిషనర్ నివాళి
హేయమైన జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు నిండిన సందర్భంగా.. అమృత్‌సర్‌లో ఉన్న స్మారకం వద్ద బ్రిటీష్ హై కమిషనర్ సర్ డామినిక్ అస్క్విత్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. స్మారకం వద్ద ఉన్న విజిటర్స్ బుక్‌లో కూడా ఆయన సంతకం చేశారు.